రెండేళ్ల వయసుకే 80 శాతం మెదడు ఎదుగుదల తల్లి గర్భంలో, జన్మించిన 24 నెలల్లోనే శిశువు మెదడులో 80 శాతం అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో తగినంత పోషకాహారం అవసరం. ఆ సమయంలో సమతుల పోషకాహారాన్ని అందించడంలో తేడా వస్తే మెదడు ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. జిల్లాలో పోషకాహార లోపం ఎంత ఉందో జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 34,83,648 జనాభా ఉంది. 8,75,432 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో నలభై శాతం కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. వారికి సరైన పోషకాహారం అందడం లేదు. గర్భిణులు, బాలింతలకు తగినంత పోషకాహారం అందకపోవడం వల్ల గర్భస్థ శిశువులపై ప్రభావం పడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లా జనాభాలో మూడో వంతు మందిలో అంటే సుమారు పది లక్షల మంది వయసుకు తగినంత ఎత్తు, ఎత్తుకు తగినంత బరువు, తగినంత మస్తిష్కం ఎదుగుదల లేదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో గుర్తించారు. దీనికి ప్రధాన కారణం పోషకాహార లోపం..! ఆయా కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు రోజుకు ‘గ్లాసు చిక్కటి పాలు’ అందించాల్సి ఉంది. రెండు నెలలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు పాల సరఫరా నిలిచిపోయింది. పోషకాహారంలో ప్రధానమైన సంపూర్ణాహారాన్ని పొందలేకపోతున్నారు. ఆ మేరకు గర్భిణికి, వారి గర్భంలోని శిశువుకు శారీరక, మానసిక ఎదుగుదలలో నష్టం జరుగుతుంది.
పాల సరఫరాలో ప్రతి నెలా అంతరాయమే!
ప్రతి రోజూ అంగన్వాడీ కేంద్రంలో నమోదైన గర్భిణులకు, బాలింతలకు ‘ఆరోగ్య లక్ష్మి’ పథకంలో ఒక పూట సంపూర్ణాహారం వండి వడ్డించాల్సి ఉంది. అలాగే మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో వాళ్లు తాగడానికి గ్లాసు చిక్కటి పాలు (200మి.లీ.) వేడి చేసి అందించాల్సి ఉంటుంది. సోమ, బుధవారాల్లో ఆ పాలను పెరుగుగా మార్చి ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్లోని ‘హాకా ద్వారా పాల టెట్రా ప్యాక్లను అంగన్వాడీ కేంద్రాలకు చేరవేసి నిల్వ చేస్తుంటారు. వారం ముందుగానే సరిపడినన్ని పొట్లాలు ఆయా కేంద్రాల్లో ఉంచితే అంతరాయం లేకుండా గర్భిణులు, బాలింతలకు పాలు అందుతాయి. చౌటుప్పల్లోని ఒక అంగన్వాడీ కేంద్రంలో 2017 నుంచి 2019 జులై వరకు పాల సరఫరాను ‘న్యూస్టుడే’ సోమవారం పరిశీలించింది. ప్రతి నెలలోనూ పాల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నిల్వలు లేకపోవడం వల్ల పాలను అందించలేక పోయారు.