మాది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్. నేను పుట్టిన నెలకే నాన్న దూరమయ్యారు. అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అమ్మే మిషన్ కుడుతూ నన్ను పెంచారు. చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ, ఏడో తరగతి నుంచే ఫుట్‌బాల్ బంతి అంటే ఇష్టం. చిన్నదాన్ని కావడంతో ఎవరూ ఆడనిచ్చేవారు కాదు. ఎనిమిదో తరగతిలో తొలిసారి బంతిపై కాలుపెట్టే అవకాశమొచ్చింది. ఇష్టమున్నా బంతి కొనే డబ్బుల్లేవు. ఆడదామన్నా అమ్మాయిని కదా, నాతో ఆడే వారూ లేరు. తర్వాత కూలీ చేసి ఆ డబ్బుతో బంతి కొన్నా. బడిలో ఉపాధ్యాయుల ఆట చూసి సొంతంగా గోడ ప్రాక్టీస్‌తో నేర్చుకున్నా.
పొలం పనులకు వెళ్తూ...
ఈ ఆటలో రాణించాలంటే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాప్ వసతి గృహానికి వెళ్లమని అయిన వాళ్లు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం పదో తరగతి తర్వాత పరీక్ష రాసి శాప్‌లో ఇంటర్‌లో చేరాను. ఇక్కడ చదువు, ఆట రెండూ ఉండాలి. కానీ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యా. ఇంకేముంది... ఇంటికి పంపించేశారు. అమ్మమ్మతో పాటు పొలం పనులకు వెళ్తూ ఏడాది గడిపేశా. అప్పుడే ఊళ్లో వాళ్లు అమ్మమ్మని నా పెంపకం గురించి హేళన చేశారు.
పెళ్లి తర్వత మారిపోయింది..
ఆవిడ ఓరోజు ఏడుస్తూ.. ఇక్కడితోనే ఆగిపోతావా.. నువ్వేంటో నిరూపించుకోవా అని చెప్పింది. ఆ మాటలు బలంగా నాటుకుపోయాయి. మా ప్రాంతంలోనే ఓ కళాశాలలో ఫుట్‌బాల్ శిక్షకురాలిగా చేరాను. అక్కడే డిగ్రీ, బీపీఈడీ చేశాను. అదయ్యాక ప్రకాశ్‌తో పెళ్లి. ఆ తర్వాత జీవితం మారిపోయింది. వ్యాపారం చేసే మా వారి ప్రోత్సాహంతో పీజీ చేశాను. ఖాకీ దుస్తులపై ప్రేమతో ఎన్‌సీసీ వైపు వెళ్లాను. శిక్షణ పూర్తి కాగానే.. 2004లో లెఫ్ట్‌నెంట్‌గా.. 2011లో కెప్టెన్‌గా.. ఇప్పుడు మేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్‌సీసీ అధికారిని.
వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతూ...
పేదరికం, అడ్డొచ్చే పెంపకం, ఆంక్షలు.. ఇవన్నీ లక్ష్యాన్ని చేరలేమనే భయంతో మనం సృష్టించుకునే ఊహలే. ఈ విషయాల్ని అమ్మాయిలకు ఎవరు చెప్పాలి? ఆ బాధ్యత నేను తీసుకోవాలనుకున్నా. నేను పడ్డ కష్టం మరెవరూ పడకూడదని... వారికి డ్రిల్స్, పరేడ్లు మాత్రమే కాకుండా బతుకు పాఠాలూ నేర్పిస్తున్నా. ఇక్కడే కాదు వందల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పా. ప్రత్యేకంగా నా దగ్గర తర్ఫీదు పొందాలనే లక్ష్యంతోనే మా కాలేజీలో చేరినవారూ ఉన్నారు. ఎదగాలన్న తపన ఉండి... పరిస్థితులు సహకరించని ఎందరో ఆడపిల్లలకు అండగా నిలబడే అవకాశం నాకు కలిగింది.
వారిని ఎన్‌సీసీలో చేర్చా..
ముఖ్యంగా పల్లెల నుంచి వచ్చి... తెలుగు తప్ప మరే భాషరాదని వెనకడుగు వేసే అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వారిని ఎన్‌సీసీలో చేర్చా. చదువుల కోసం పుస్తకాలు కొనిపెట్టా. ఫీజులూ కట్టా. వీరిలో చాలామంది జూడో, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతున్నారు. వారిలో మోడల్, మిస్ ఎర్త్ టైటిల్ విజేత డా.తేజస్విని మనోజ్ఞ ఒకరు. మృదుల ఇన్‌కంట్యాక్స్ అధికారిగా చేస్తోంది. నా దగ్గర శిక్షణ పొందిన వందల మంది అమ్మాయిలు భారత సైన్యం, పోలీస్ విభాగాల్లోకి వెళ్లారు. మరెన్నో వృత్తుల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నా కన్నబిడ్డల విజయాల కన్నా వీరు ఎదిగిన తీరు సంతృప్తినిస్తోంది.
2008లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఎన్‌సీసీ అధికారిగా పురస్కారంతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నా. నాకు మొక్కల పెంపకం అన్నా చాలా ఆసక్తి. మా మిద్దె మీద మూడు వందల రకాల చెట్లను పెంచుతున్నా. అవకాశాలు ఎవరూ ఇవ్వరు. మనమే సృష్టించుకోవాలి. అమ్మాయిలకు కావలసింది ఆత్మవిశ్వాసం. దాన్ని వదిలేసి తమకు పరిస్థితులు సహకరించడం లేదనుకోవడం పిచ్చితనమే అవుతుంది.
ఇదీ చూడండి:డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?