విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా కంపెనీలో స్టైరీన్ గ్యాస్ లీకేజీ జరగడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చనీయాంశమైంది. నల్గొండ, యాదాద్రి జిల్లాలు రాజధానికి ఆనుకొని ఉండటంతో పాటు ఫార్మా, టెక్స్‌టైల్స్, మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు ఇక్కడే ఉండటంతో వాటిల్లో పనిచేసే కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
విశాఖపట్నంలో లీకైన తరహా గ్యాస్‌ను వాడే పరిశ్రమలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేవని అధికారులు చెబుతున్నారు. అయితే ఎక్కువ ముప్ఫు. ఔషధ పరిశ్రమలు విడుదలచేసే వ్యర్థాల నుంచేనని వారు గుర్తు చేస్తున్నారు. ప్లాస్టిక్ తయారీ తొలిదశలో ముడి సరకును తయారు చేసేందుకు స్టైరీన్ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. జిల్లాలో ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలున్నా అవి ముడి సరకుతో ప్రస్తుతం మనం వాడుతున్న ప్లాస్టిక్‌ను తయారు చేసేవే. వీటిలో ఎక్కడా స్టైరీన్ గ్యాస్‌ను వాడటం లేదు.
నిబంధనల బేఖాతర్
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి, బొమ్మలరామారం, చౌటుప్పల్, చిట్యాల తదితర మండలాల్లో దాదాపు 100 పెద్ద, మరో 200 చిన్నాచితక ఔషధ పరిశ్రమలున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఈ తరహా పరిశ్రమల్లో దాదాపు 40 శాతానికి పైగా ఇక్కడే కొలువుదీరాయి. ఫలితంగా బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల మండలాల్లోని కొన్ని పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ఇక్కడి ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్నారు.
రాత్రి అయితే చౌటుప్పల్ పరిసరాల్లోని కొన్ని పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువుల (కంపు)తో అక్కడ నివసించలేని పరిస్థితి. మరోవైపు ఇక్కడి ఔషధ పరిశ్రమల్లో కొన్ని ప్రభుత్వ సూచనలు పాటించి పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్నా మరికొన్ని ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల సహకారం ఉండటంతో స్థానికులు ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వారు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.