తెలంగాణ

telangana

జల దిగ్బంధంలో నడిగూడెం.. అవస్థలు పడుతున్న గ్రామస్థులు

By

Published : Sep 27, 2020, 5:58 PM IST

కాంట్రాక్టర్ల పనితీరుకు.. చెరువుల ఆక్రమణలు తోడవడం వల్ల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రం జలదిగ్బంధమయింది. కాంట్రాక్టర్లు, అధికారుల వైఫల్యం కారణంగా నడిగూడెం మండల కేంద్రం నీట మునిగింది..

nadigudem village drained in floods in suryapet district
జల దిగ్బంధంలో నడిగూడెం.. అవస్థలు పడుతున్న గ్రామస్థులు

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని చౌదరి చెరువు గతకొంతకాలంగా ఆక్రమణలకు గురవుతోంది. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ ఎడుమ కాలువ ద్వారా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చెరువులు నీటితో నింపారు. ఈ క్రమంలో నడిగూడెం చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు అలుగుపారింది. దీనికి తోడు.. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి చౌదరి చెరువులో నీరు ప్రమాదస్థాయికి చేరింది. అలుగు పోసిన చెరువు వరదనీరు గ్రామంలోకి చేరింది.

కుండపోత వర్షం.. నిండి పొంగిన చెరువు
గతంలో ఎన్నడూ లేనివిధంగా నడిగూడెంలో వర్షపాతం నమోదయింది. జిల్లాలోనే అత్యధికంగా 18.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీవర్షం కారణంగా చెరువు మత్తడి దూకి.. గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇళ్లలోకి చేరిన నీరు..
చెరువు మరియు నాలాల ఆక్రమణ వల్ల కాలువ చిన్నదై వరద ప్రవాహం గ్రామాన్ని చుట్టి ముట్టింది. ఎస్సీ, బీసీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు చేరి.. దాదాపు 70 కుటుంబాలు రోడ్డుపైకి వచ్చారు. ఒక్కసారిగా వచ్చిన వరద నీటితో చిన్నపిల్లల్ని ఎత్తుకొని.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని.. బిక్కుబిక్కుమంటూ రాత్రంతా వర్షంలో రోడ్లపై నిలబడ్డారు. పశువులు, కోళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఓ కుటుంబానికి చెందిన గొర్రెపిల్లలు అన్ని వరద నీటిలో కొట్టుకుపోయాయి. నిత్యావసర వస్తువులు, సరకులు, టీవీలు, మంచాలు, ఇంట్లోని వస్తువులన్నీ.. నీటిపాలయ్యాయి. తడిసిన గోడలు ఎప్పుడు కూలుతాయో.. తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షం కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపక్కన నిలిపి ఉంచిన వాహనాలు బురద నీటిలో కూరుకుపోయాయి.
బాధ్యత ఎవరిది?
అకాల వర్షాల వల్ల చెరువు అలుగు పోస్తున్నపటికి కాలువల మీద నిర్మించిన అక్రమ నిర్మాణాలే ప్రస్తుత పరిస్థితి కారణం అంటున్నారు స్థానికులు. గతంలో చెరువు అలుగు మీద ఉన్న వంతెనపై గుత్తేదారులు మట్టిపోసి దానిపై సీసీ రోడ్లను నిర్మించారు. దీని వల్ల నాలాలు మూసుకుపోయి వరద నీరు రోడ్డుమార్గం గుండా నివాసాల్లోకి చేరింది. గుత్తేదారుల నాసీరకపు పనులకు అధికారుల నిర్లక్ష్యం తోడు కావడం వల్ల నడిగూడెంలో ఇంతటి ఆస్తి నష్టం వాటిలిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చౌదరి చెరువు అలుగు నుంచి వచ్చే వరద కాలువ ద్వారా సారంగేశ్వర చెరువుకు వెళ్లేందుకు నాలాలు ఉన్నప్పటికీ అవి ఆక్రమణకు గురికావడం వల్ల వరద నీరు ఊరును చుట్టుముట్టింది

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే..
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నడిగూడెం మండల కేంద్రంలో వరద ఉద్ధృతిని పరిశీలించారు. జేసీబీపై మండల కేంద్రంలో తిరుగుతూ.. వరద ప్రవాహాన్ని సమీక్షించారు. తక్షణమే ముంపు బాధితులను స్థానిక ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాలకు తరలించి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నడిగూడెం ఎస్సై చలిగంటి నరేష్ ఆధ్వర్యంలో గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు సైతం.. బాధితులకు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికైనా అలుగు వద్ద వంతెన నిర్మించి నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలిగిస్తే వరద నీటి సమస్య తీరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: దుబ్బాకపై కాంగ్రెస్ కసరత్తు.. ఉప ఎన్నికపై సన్నాహక సమావేశం

ABOUT THE AUTHOR

...view details