Uttamkumar Reddy Comments: నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోండ్రియాలలో పర్యటించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకున్న ఎంపీ.. స్థానికుల ఇబ్బందులు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తీవ్ర అసహనంతో ఉన్న ఉన్న ప్రజలు.. ఉత్తమ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
"ఓట్ల కోసం వచ్చావా..?" అంటూ ఉత్తమ్‌ను గ్రామస్థులు నిలదీశారు. ఇన్నిరోజులు తమ సమస్యలు పట్టలేదా..? అని ప్రశ్నించారు. తమ సమస్యలు ఎవ్వరికీ అవసరం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్న స్థానికులను శాంతపర్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోవటంతో.. ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానంగా "మీ ఓట్లు నాకు అవసరం లేదు" అంటూ ముఖం మీది చెప్పుకుంటూ.. ఉత్తమ్ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ఓట్లు అవసరం లేదని వెళ్లిపోవటంపై స్థానికులు మరింత ఆగ్రహంవ్యక్తం చేశారు.