మనసు, మనసు కలవడంతో పద్నాలుగేళ్ల క్రితం... ప్రేమ వివాహం చేసుకున్నారు. తన తల్లిదండ్రులు ఒప్పుకోకున్నా అత్తగారి తరఫు వారు పెళ్లి చేయడం వల్ల... సొంతూరు వదిలిపెట్టాడు. భార్య కుటుంబ సభ్యుల చెంతన ఉండాలని భావించి... వారికి దగ్గర్లోనే కాపురముంటున్నాడు. కొడుకు, కూతురితో అన్యోన్యంగా కనిపించిన ఆ కుటుంబం... అంతర్గత గొడవలతో అతలాకుతలమైంది. దంపతుల మధ్య నెలకొన్న అనుమానపు బీజాలు... చివరకు ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకున్నాయి.
సూర్యాపేటలో ఇద్దరు పిల్లల్ని చెరువులోకి తోసేసిన ఘటన... హృదయవిదారకంగా మారింది. తాను దూకలేక ఒడ్డున కూర్చుందా లేక... కావాలనే పిల్లలిద్దర్నీ వదిలించుకుందా అనే కోణంలో విచారణ సాగుతోంది. హైదరాబాద్కు చెందిన తాయి ప్రశాంత్, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం సింగిరెడ్డిపాలేనికి చెందిన నాగమణిలది ప్రేమ వివాహం. నాగమణి కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లింది. అక్కడ ప్రశాంత్ పరిచయమయ్యాడు. ఆ బంధం పెళ్లివరకూ దారితీసింది. ఆదిలో ఆ దంపతుల అన్యోన్యతను చూసి అందరికీ కన్ను కుట్టేది. ఆ ఆత్మీయతలో అనుమానమనే చిచ్చు రేగింది.
ఎలా జరిగింది
సూర్యాపేటలోని విద్యానగర్లో నివాసముంటున్న ప్రశాంత్ దంపతులకు ఎనిమిదేళ్ల కుమార్తె జ్యోతిమాధవి, ఆరేళ్ల బాబు హర్షవర్ధన్ ఉన్నారు. ఇవాళ వేకువజామున తన పిల్లలు చెరువులో పడిపోయారని.. నాగమణి ఒడ్డున కూర్చుని ఏడుస్తోంది. ఉదయపు నడకకు వెళ్లిన వారు ఆరా తీశారు. తానే పిల్లలిద్దర్నీ నీళ్లలోకి తోసేశానంటూ చెప్పిన ఆ కర్కశ మాతృమూర్తి... తనకు మాత్రం దూకేందుకు ధైర్యం చాలలేదని వాపోయింది. అయితే ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగినట్లు ఆమె చెబుతుండగా... విషయం పోలీసులకు చేరింది.