పంటలపై వానర సైన్యం దండయాత్ర.. బెంబేలెత్తుతున్న ప్రజలు Suryapet District is Facing a Lot of Monkey: ఆరుగాలం శ్రమించి పండించిన యాసంగి పంట వానర సైన్యం పాలవుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం మండలాల్లో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతులు రైతు వేదిక కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యాన్ని సైతం వరి గింజలు వలుచుకొని తినడంతో రైతులు అధింకంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాజిరెడ్డిగూడెంలోని సబ్ మార్కెట్ యార్డులో అమ్మడానికి ఆరబోసిన ధాన్యంలో వందల సంఖ్యలో కోతులు వచ్చి ధాన్యాన్ని తింటున్నాయి. మండలంలోని అర్వపల్లి, బొల్లంపల్లి, కాసర్ల పార్ట్, తిమ్మాపురం, అడివిమల, కుంచమర్తి ,పరసాయపల్లి, తదితర గ్రామాలలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. వారం రోజుల్లోనే బొల్లంపల్లిలో ఐదుగురిని, అర్వపల్లిలో ఇద్దరిని, ఇతర గ్రామాల్లో.. 10 మందికి సైతం గాయపరచడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
Monkeys are Attacking Crops in Suryapet District: ఈ ప్రాంతంలో కోతుల బెడద అధికంగా ఉండడంతో అన్నదాతలు చిరుధాన్యాలు, కూరగాయలు పండించట్లేదు. తుంగతుర్తి, నాగారం మండలాల్లో వానరులు తీవ్రంగా తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ మండలాల్లో రైతులు ప్రధానంగా వేరుశనగ, జొన్న, కూరగాయల పైరులు అధిక విస్తీర్ణంలో పండిచేవారు. కోతుల బెడదతో గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాతలు నష్టపోవడంతో గత్యంతరం లేక వరి, పత్తి వేస్తున్నారు. అవికూడ వానరాలు ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతుల నివారణ కోసం:ప్రతి రోజూ రైతులు తమ పంట పొలాలను కాపాడుకోవడానికి విడతలవారిగా కాపలాకాస్తున్నారు. కొందరు రైతులు కొండముచ్చులు, వేట కుక్కలను వేలాది రూపాయలు వెచ్చించి తమ పంట పోలాల వద్ద కాపలాగా ఉంచుతున్నారు. మరికొందరు అన్నదాతలు వివిధ వానరాలను తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో జామ, మామిడి, సపోటా తోటలు ఉండేవి అవి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కోతులను బోనులలో పట్టుకుని భద్రాచలం అడవుల్లో వదిలేసేవారు. అలా కోతులను తరలించేందుకు ఒక్కో కోతికి సుమారు రూ.400 ఖర్చు చేసేవారు.
కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మాకు చాలా నష్టం చేస్తున్నాయి. తరుముతుంటే మనుషుల మీదకు ఎగబడుతున్నాయి. వరి చేలో మొత్తం కోతులు పాడు చేశాయి. ఆ ఉన్న పంటను కోసి ఈ యార్డులో పోస్తే.. ఇక్కడ కూడా ఇలా తిని ఆగం చేస్తున్నాయి. దీనిని అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నాం. -స్థానికుడు
గ్రామాల్లోని ఇండ్లల్లో కోతుల చొరబడి ఇంట్లో తినుబండారాలు వివిధ వస్తువులను ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తే.. వారిపై చేస్తున్నాయి. అలాగే ఇండ్ల పైకప్పు పెంకులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. కిరాణ దుకాణం యజమానులు దుకాణం ముందు గ్రిల్స్‌తో రక్షణ వలయాలు ఏర్పాటు చేసి తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న చిన్నారులు, వృద్దులపై దాడి చేసి గాయపరిచిన ఘటనలు ఇక్కడ చాలానే ఉన్నాయి. కోతుల నుంచి తక్షణమే తమను కాపాడాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.
ఇవీ చదవండి: