Mob Attack on Telangana Police in AP : రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కీలక నిందితుడ్ని అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లికి వెళ్లిన గరిడేపల్లి పోలీసులపై ముఠా సభ్యులు దాడి చేశారు. పోలీసుల అదుపులోని నిందితుడ్ని తప్పించి పరారయ్యారు. కానిస్టేబుల్‌కు గాయాలు కాగా.. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకోగా.. గురువారం వెలుగుచూసింది.
సినీఫక్కీలో.. రేషన్ బియ్యం నిందితుణ్ని తప్పించిన ముఠా - రేషన్ బియ్యం నిందితుణ్ని తప్పించిన ముఠా
Mob Attack on Telangana Police in AP : తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుంటే.. అసలు నిందితుడు ఏపీకి చెందిన వాడని తేలింది. ఎట్టకేలకు దొరికిన అతణ్ని పట్టుకోవడానికి ఏపీ వెళ్లిన పోలీసులు.. నిందితుణ్ని అరెస్టు చేశారు. కారులో కొద్దిదూరం వెళ్లగానే నిందితుడి అన్న పదుల సంఖ్యలో దుండగులతో వచ్చి పోలీసు కారును అడ్డుకున్నాడు. అడ్డొచ్చిన సిబ్బందిపై దాడికి తెగబడి.. సినీఫక్కీలో తమ్ముణ్ని తప్పించాడు.
స్థానిక పోలీసుల వివరాల ప్రకారం..
Ration Rice Smuggler Escaped : గతేడాది నవంబరు 19న సూర్యాపేట జిల్లా గరిడేపల్లి నుంచి 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో వెళ్తున్న వాహనాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదుచేసి డ్రైవర్ గంగరాజును విచారించారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన బొమ్మిరెడ్డి శ్రీనివాసరావు (వాసు) డ్రైవర్‌ని అని..వారి గోదాముకు బియ్యం తరలిస్తున్నట్లు చెప్పారు. దీంతో కీలక నిందితుడిగా వాసుపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు రావాలని పలుమార్లు సమాచారమిచ్చినా నిందితుడి నుంచి స్పందన లేదు. దీంతో అక్కడికి వెళ్లి అరెస్టు చేయాలని భావించి దాచేపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. బుధవారం రాత్రి 8.00 గంటలకు గరిడేపల్లి ఎస్‌ఐ కొమిరెడ్డి కొండల్‌రెడ్డి సొంత వాహనంలో కానిస్టేబుళ్లు సైదులు, నాగేశ్వరరావుతో దాచేపల్లికి వెళ్లారు. అక్కడి ఏఎస్‌ఐ కొండల్‌రావు సాయంతో గోదాముకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. గరిడేపల్లికి తరలించేందుకు కారులో కొద్దిదూరం తీసుకురాగానే నిందితుడి అన్న నాగరాజు 25 మందితో వచ్చి వాహనాన్ని అటకాయించి కర్రలతో దాడికి పాల్పడి రాళ్లు విసిరారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సినీఫక్కీలో నిందితుడ్ని తప్పించి కారులో పరారయ్యారు. దాడిలో కానిస్టేబుల్ నాగేశ్వరరావు గాయపడ్డారు. అక్కడి నుంచి పోలీసులు నేరుగా దాచేపల్లి స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నాగరాజుతో పాటు మరొకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.