Etela Rajender in Suryapet : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలను ఉద్యోగులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని భాజపా నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం స్థానికత ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరగాలని ఆదేశాలున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా పనిచేసిన ఉద్యోగులను మనోవేదనకు గురి చేయొద్దని కోరారు.
సూర్యాపేట జిల్లాకేంద్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ ప్రాంత రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుశిక్షణా తరగతులకు ముఖ్యఅతిధిగా హాజరైన ఈటల... ఎటువంటి శాస్త్రీయత , పారదర్శకత లేకుండా ఉద్యోగుల బదిలీలను చేపట్టారని విమర్శించారు. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్... చర్చలు జరపకుండా హడావుడి చేస్తున్నారని విమర్శించారు. జీవో 317తో టీచర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అన్నారు.