వైద్యంతో పాటు రోగికి నైతిక స్థైర్యం అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నందున... వైద్య సిబ్బందికి నెల రోజులకు పైగా సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలు, వసతులపై రోగులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతతో పాటు ముందు జాగ్రత్త చర్యలు చేపడితేనే... రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఈటల రాజేందర్ అన్నారు. మెరుగైన వైద్య సేవలందాలంటే... వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. అనంతరం వైద్యకళాశాలను సందర్శించి... భవన నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరమే తరగతులు ప్రారంభమైనందున... బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడిన మంత్రి... వైద్య వృత్తి ప్రాధాన్యాన్ని వివరించి, తల్లిదండ్రుల కలల్ని నిజం చేయాలని హితబోధ చేశారు.