పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని కోమటిరెడ్డి సోదరులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దురదృష్టకరమని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆహార భద్రతా కార్డులపంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పదవులను అడ్డంపెట్టుకుని సంపాదించే అలవాటున్న వారికి ప్రజా సంక్షేమం పట్టడంలేదన్నారు. సొంత పార్టీ వాళ్లే కోమటి రెడ్డి సోదరులను చిల్లరగాళ్లలా చూస్తున్నారని... అలాంటి వారి గురించి తాము ఆలోచించే పరిస్థితి లేదన్నారు.
దళితబంధు పేరు చెబితే ప్రతిపక్షాలకు వణుకు పుడుతుందని... దళితబంధు విజయవంతమై... ప్రతిపక్షాలు డిపాజిట్లు కోల్పోతామనే భయంతో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ఎన్నికలున్నాయన్న సాకుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపాలని ప్రతిపక్షాల ఆలోచనగా ఉందన్నారు. ఉప ఎన్నికలకు దళిత బంధుకు సంబంధం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.
కోమటిరెడ్డి సోదరులవి దివాళాకోరు రాజకీయాలు. వాళ్లకు ఎవ్వరి పట్ల గౌరవం లేదు. చట్టం పట్ల గౌరవం లేదు. ఆఖరుకు వాళ్ల అధినాయకత్వం పట్ల కూడా గౌరవం లేదు. మైకు ముందు ఒకమాట, మైకు తీసేసిన తర్వాత ఒకమాట మాట్లాడి ప్రజల్లో వాళ్లే పలచన అవుతున్నారు. ప్రజల్లో ఉండలేక, ప్రజల్లో తిరగలేక, ప్రజలకు సేవ చేసే శక్తి లేక... వ్యక్తిగత ప్రయోజనాలకే పదవులు ఉపయోగించుకునే అలవాటు ఉన్నవాళ్లు కాబట్టి... ఇప్పుడా అలవాట్లు సాగడం లేదనే ఉద్దేశంతోనే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకు వచ్చిన పదవులు అడ్డం పెట్టుుకుని కాంట్రాక్టులు సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం తప్ప వాళ్లకు ఇంకో పని తెలియదు. ఎప్పుడో రెండు మూడు నెలలకోసారి నియోజకవర్గాలకు రావడం.. ఏదొకటి చిల్లర మాటలు మాట్లాడడం, మీడియాలో సెన్సేషన్ కావాలని చూడడం వాళ్లకు పరిపాటి. ఇంకా వాళ్ల భూస్వామ్య పోకడలు, పైసలతోటి, నోటితోటి భయపెట్టవచ్చనే ఆటలు ఇక సాగవు జిల్లాలో. సొంతపార్టీ వేదికలపై తన్నుకుని కేసులు పెట్టుకోవడం మీకు అలవాటు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గంలో ఒక్కరోజైనా తిరిగాడా..? నేను వెళ్లిన వాటిలో సగం సార్లు కూడా రాజగోపాల రెడ్డి నియోజకవర్గానికి రాలేదు. మునుగోడుకు పోతే ఎమ్మెల్యే, ఎంపీ ఎక్కడికి వెళ్లారని ప్రజలు అడుగుతున్నారు. దళితబంధు పథకం కూడా విజయవంతమవుతాది. ఈరాష్ట్రంలో తమకు డిపాజిట్లు ఉండవని దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక ఉప ఎన్నిక కోసం రాష్ట్రంలో పరిపాలన ఆపేస్తామా..? తప్పకుండా ప్రతి కార్యక్రమం అమలు చేస్తాం. ఇక్కడ మా చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు. మా పనితనాన్ని ఎవ్వరూ ఆపలేరు. - జగదీశ్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
డిపాజిట్లు కోల్పోతామనే భయంతోనే దళితబంధుపై విమర్శలు ఇదీ చూడండి:Huzurabad: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ