రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నికల్లో తెరాసకు పోటీనిచ్చే పార్టీలు లేవని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించినన్ని పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఆలోచించాల్సిన అవసరం లేదని.. తెరాసదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సరైన పద్ధతిలో పని చేసి ఎన్నికల్లో విజయానికి దోహదపడాలని పిలుపునిచ్చారు.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు పోటీనే లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి గెలుపును ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వాలి..
కార్యకర్తలు సమన్వయంతో పని చేసి, ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని గెలిపించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పేర్కొన్నారు. ఈ గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఇప్పటి నుంచే కార్యకర్తలను సన్నద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, సూర్యాపేట జిల్లా రైతు సమన్వయ కర్త రజాక్, గుజ్జ యుగేందర్, మండల పార్టీ అధ్యక్షులు సంకెపెల్లి రఘునందన్ రెడ్డి, గుడిపాటి సైదులు, మున్న మల్లయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. గంగు భానుమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం