తెలంగాణ

telangana

ETV Bharat / state

Krishna river: జల విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదు: జగదీశ్​ రెడ్డి

జల విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదని... ఆ హక్కు ఏ కమిటీకి గానీ లేదా కమిషన్​కు లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుదుత్పత్తి కోసమని గుర్తు చేశారు.

jagadeesh reddy
జగదీశ్​ రెడ్డి

By

Published : Jun 30, 2021, 10:33 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో.. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలని.. ఇష్టానుసారం ఉత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ ఎందుకు ఉందని ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు.

జల విద్యుదుత్పత్తిని ఆపడం ఎవరి తరం కాదని... ఆ హక్కు ఏ కమిటీకి గానీ లేదా కమిషన్​కు లేదని మంత్రి జగదీశ్​రెడ్డి తేల్చిచెప్పారు. సూర్యాపేటలో మాట్లాడిన ఆయన... ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మానవీయ కోణంలో కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా... పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తామన్న ధోరణితో ఉంటే కుదరదని తేల్చిచెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుదుత్పత్తి కోసమని గుర్తు చేశారు. తెలంగాణ నీటి దోపిడీకి పాల్పడుతోందన్న ఏపీ ప్రభుత్వ వాదనను జగదీశ్ రెడ్డి తిప్పికొట్టారు.

ఏపీ పాత ఆటలు సాగవు. ఇక్కడున్నది కేసీఆర్​ అని గుర్తుంచుకోవాలి. ఇష్టమొచ్చినట్లు చేస్తే కుదరదు. మీరు చెబితే ఆగడానికి తెలంగాణ అమాయకంగా లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులు ఏమిటో.. కృష్ణా నదిలో మా వాటా ఎంతనో, నీటిని ఎలా వినియోగించుకోవాలో మాకు బాగా తెలుసు.

-గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి

రాష్ట్రంలో వందశాతం సామర్థ్యంతో జల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో విద్యుత్ శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తిలో జెన్‌కో అధికారులు వేగం పెంచారు. రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి ఒక్క రోజులోనే రెట్టింపు అయింది. సోమవారం 5.06 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి మంగళవారం నాటికి 11.12 మిలియన్‌ యూనిట్లకు చేరుకుందని అధికారులు తెలిపారు. అప్పర్‌ జూరాలలో 2.33 మిలియన్‌ యూనిట్లు, లోయర్‌ జూరాలలో 2.47 మిలియన్‌ యూనిట్లు, శ్రీశైలంలో 4.42 మిలియన్‌ యూనిట్లు, నాగార్జునసాగర్‌లో 1.88 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి అయినట్లు జెన్‌కో అధికారులు వెల్లడించారు. గ్రిడ్‌ డిమాండ్‌ను బట్టి యూనిట్లు రన్‌ అవుతాయని.. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పూర్తిస్థాయిలో విద్యుద్ ఉత్పత్తి సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.

తెలంగాణ జెన్‌కోకు పులిచింతల ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. పులిచింతలలో అనధికారికంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ జెక్‌కో విద్యుదుత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 19.17 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: AP Ministers on krishna: 'వారికంటే నాలుగు మాటలు ఎక్కువే మాట్లాడే కెపాసిటీ ఉంది'

ABOUT THE AUTHOR

...view details