నేటి పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కొత్త సాగు చట్టాల వల్ల కలిగే దుష్ప్రరిణామాలు ఇతివృత్తంగా తీసిందే రైతన్న సినిమా అని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. రైతులోకాన్ని మేల్కొలిపే రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. రైతుల మేలు కోరే కథాంశంతో సినిమా తీశానని.. తన సినిమాను చూసి ఆదరించాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి చేసిన విజ్ఞప్తి మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని థియేటర్లో మంత్రి నిన్న సినిమాను చూశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి చేసిన ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు.
మీడియా ద్వారా మంత్రి స్పందన చూసిన ఆర్.నారాయణమూర్తి స్వయంగా సూర్యాపేటకు వచ్చారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంచి కథాంశంతో.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. ప్రజలను చైతన్యపరచి, జాగృత పరిచేలా నారాయణమూర్తి చేసిన ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సాగు చట్టాలు రైతుల మీద ఉరుములు లేని పిడుగుల లాంటివని మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చే కుట్రలో భాగమే ఆ చట్టాల రహస్యమని అభిప్రాయపడ్డారు.
నారాయణమూర్తి విజ్ఞప్తి మేరకు నేను రైతన్న సినిమా చూశాను. ప్రతిక్షణం పేదల గురించి, రైతుల కష్టాల గురించి ఆలోచించే నారాయణమూర్తి.. వారిని చైతన్యం చేసేందుకు సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలు భారతదేశ వ్యవసాయరంగంపై ఏవిధంగా ప్రభావం చూపిస్తాయని చాలా చక్కగా చూపించారు.-జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి