Minister Jagadeesh Reddy on BJP: కేంద్ర మంత్రి అమిత్ షా ఒక అబద్ధాల షా అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఎక్కడ దిల్లీ వరకు వస్తాడోననే భయంతోనే.. భాజపా నేతలు రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. తెలంగాణకు రుణాలు రాకుండా ఏ రకంగా ఎఫ్ఆర్బీఎం పరిధిని నిర్ణయిస్తున్నారని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగంపై మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎదురు చూస్తారని, ఏదో ఒక అభివృద్ధి పనులు మంజూరు చేస్తారని ప్రజలు ఆశపడతారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నిన్న తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రులు ఎందుకు తెలంగాణకు అభివృద్ధి పనులు మంజూరు చేయలేదని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం 80 లక్షల కోట్ల అప్పు చేసిందని గుర్తు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి.. ప్రపంచంలోని ఏ సంస్థ అయినా తెలంగాణ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని గుర్తు చేశారు. భాజపా పాలిత రాష్ట్రాలకు ఏ ఒక్క సంస్థ కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. తమకు దక్కని గుర్తింపు కేసీఆర్కు దక్కుతుందన్న కుట్రతో కేంద్రంలోని భాజపా మంత్రులు తెలంగాణకు రుణాలు ఇవ్వకుండా ఆయా సంస్థలను బెదిరిస్తున్నాయని ఆరోపించారు. దేశానికి మీరు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.