పెద్దగట్టు జాతర వేళాయే.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు Peddagattu Jathara From Today: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై కొలువైన యాదవుల ఆరాధ్య దైవం "లింగమంతుల స్వామి" జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండెళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. రాష్ట్రంలో సమ్మక్క-సారక్క తరువాత రెండో అతిపెద్దదిగా లింగమంతుల స్వామి జాతర గుర్తింపు ఉంది.
ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు కర్ణాటక నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది 15 నుంచి 20 లక్షల మేర భక్తులు జాతరకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారిని దర్శించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. భారీగా వచ్చే భక్తులకు స్థల సమస్య తలెత్తకుండా పెద్దగట్టు పరిసరాలలోని వ్యవసాయ భూములకు పంట పరిహారం చెల్లించి లీజుకు తీసుకున్నారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధాన మార్గాల్లో వాహనాలను వివిధ దారుల్లోకి మళ్లించనున్నారు. జాతరకు లక్షల సంఖ్యలో భక్తుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచారు. ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఐదోరోజు మకర తోరణం తిరిగి కేసారం ఊరేగింపుతో ముగుస్తుంది.
ఇవీ చదవండి: