తెలంగాణ

telangana

ETV Bharat / state

గెలుపుతోనే సమాధానం చెప్పాలి: కేటీఆర్​ - kcr latest news

హుజూర్‌నగర్ ఎన్నిక ఎన్నో ప్రశ్నలకు సమాధానమని... పీసీసీ అధ్యక్షుడి సీటునే కైవసం చేసుకున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పేర్కొన్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో తెలంగాణ భవన్​లో కేటీఆర్ సమావేశం నిర్వహించి అభినందించారు. భాజపా 104వ స్థానంలోనూ డిపాజిట్ కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఇదే స్ఫూర్తితో మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ విజయం కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

గెలుపుతోనే సమాధానం చెప్పాలి: కేటీఆర్​

By

Published : Nov 5, 2019, 6:01 AM IST

Updated : Nov 5, 2019, 9:26 AM IST

గెలుపుతోనే సమాధానం చెప్పాలి: కేటీఆర్​

హుజూర్ నగర్​లో సైదిరెడ్డి గెలుపు... తెరాస శ్రేణుల సమష్టి విజయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ అభినందించారు. హుజూర్​నగర్ గెలుపు ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చిందన్నారు. హుజూర్ నగర్​లో విజయం మామూలు గెలుపు కాదని.. పీసీసీ అధ్యక్షుడి సీటునే కైవసం చేసుకున్నామన్నారు. తన రోడ్ షో రోజునే గెలుపు ఖాయమని తేలిపోయిందని... సుమారు 40 వేల నుంచి 50 వేల వరకు మెజార్టీ వస్తుందని ముందే ఊహించామని చెప్పారు.

అయితే తెరాస నాయకులు, కార్యకర్తలు విజయాహంకారంతో మిడిసి పడొద్దని.. కోటి ఆశలతో స్థానిక ప్రజలు తమను గెలిపించారని గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్​ సూచించారు. కక్ష సాధింపులు, లేనిపోని పంచాయితీల జోలికి వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. హుజూర్ నగర్ ప్రజల రుణం తీర్చుకొనే బాధ్యత సైదిరెడ్డిపై ఉందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో తెలంగాణ భవన్​లో కేటీఆర్ సమావేశం నిర్వహించి అభినందించారు.

కారును పోలిన గుర్తులు లేకపోతే... మెజారిటీ 50వేలు దాటేదని కేటీఆర్ పేర్కొన్నారు. కారును పోలిన గుర్తులును తొలగించేలా పార్టీ పరంగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని... అలాంటి గుర్తులను గుర్తిస్తే ఈసీని సంప్రదించవచ్చునని పార్టీ సీనియర్ నేతలకు కేటీఆర్ చెప్పారు. ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ... ఘన విజయం సాధించారని హుజూర్ నగర్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను అభినందించారు.

పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఓటమితో... కొన్ని విషయాలు నేర్చుకున్నామని... అదేవిధంగా హుజార్ నగర్​లో గెలుపుతోనూ కొన్ని విషయాలు తెలుసుకున్నామన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికను రద్దు చేయించాలని బీజేపీ ప్రయత్నం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. మున్సిపాల్టీ ఎన్నికల తర్వాతే ఉపఎన్నిక జరిగేలా చూడాలని ప్రయత్నించినట్లు తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందన్నారు. భాజపా 104వ స్థానంలోనూ డిపాజిట్ కోల్పోయిందని ఎద్దేవా చేశారు.
ఈ నెలలో లేదా వచ్చే నెలలో జరగనున్న మున్సిపాల్టీ ఎన్నికలకు తెరాస శ్రేణులు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపాల్టీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. ప్రత్యర్థ పార్టీల్లో అభ్యర్థులే లేరని.. అతి విశ్వాసంతో ఉండొద్దని... ఎన్నికలు... ఎన్నికలుగానే తీసుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

ఎగిరెగిరి పడుతున్న వారికి గెలుపుతోనే సమాధానం చెప్పాలని కేటీఆర్ చెప్పారు. కొందరు విపక్ష నేతలకు ముఖ్యమంత్రిని కూడా ఏకవచనంతో సంబోధిస్తూ.. కనీసం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్న కేటీఆర్.. తెరాస కార్యకర్తలు మాత్రం విపక్షాల బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

మున్సిపల్ ఎన్నికల తర్వాత కేసీఆర్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఉంటాయని కేటీఆర్ తెలిపారు. సమావేశంలో మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:అబ్దుల్లాపూర్‌మెట్‌లో విషాదం... తహసీల్దార్ దారుణ హత్య

Last Updated : Nov 5, 2019, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details