Garbage Burning At Kodada Dumping Yard: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో నిత్యం పారిశుద్ధ్య కార్మికులు సేకరించే చెత్తను అనంతగిరి మండలం వెంకటరాంపురం గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న గుట్టపై డంప్ చేస్తారు. పేరుకు సేంద్రియ ఎరువుల కేంద్రం కానీ, తడి పొడి చెత్తను వేరు చేసే సౌకర్యాలు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. నిత్యం మంటల్లో చెత్తను కాల్చడంతో పొగ పక్కనే ఉన్న వెంకట్రామపురం, గోల్ తాండ, వాయిలసింగరం, రామిరెడ్డిపాలెం గ్రామాల ప్రజలు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో శ్వాసకోశ, చర్మ సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్థులు ఏళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇటీవల సమస్య తీవ్రతరం కావడంతో వెంకట్రామపురం గ్రామస్థులు పెద్ద సంఖ్యలో నిరసన తెలియజేశారు. దీంతో కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ హేమంత్ పాటిల్‌తో డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు కానీ.. సమస్య పరిష్కారం కావడంలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. చెత్త నుంచి వచ్చే దుర్వాసన కారణంగా గ్రామంలో ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని.. దాంతో జబ్బుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Villages Polluted By Kodada Dumping Yard: కోదాడ పురపాలికలో నిత్యం 45టన్నులకు పైగా చెత్త డంపింగ్ యార్డుకి వస్తుంది. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేసి విక్రయిస్తే ఆదాయం కూడా వస్తుంది. దీని మూలాన చెత్తను కాల్చే అవకాశం తప్పుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో అటు ఆదాయం కోల్పోవడంతో పాటు, ఇటు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.