తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళల మొబైల్​ టాయ్​లెట్స్​కి ఆదరణ.. కోదాడలో ప్రారంభం! - మొబైల్​ టాయ్​లెట్స్

కోదాడలో మహిళల టాయ్​లెట్స్​ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ జలగం సుధీర్, సుష్మ దంపతులు మహిళలకోసం సంచార మహిళ శౌచాలయ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వీరి ఆలోచనకు కోదాడ మున్సిపాలిటీ సహకరం తోడైంది. మహిళల కోసం సంచార మరుగుదొడ్లను రాష్ట్రంలోనే మొదటిసారిగా సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించారు.

Kodada Mobile Toilets Giving Successful Results
మహిళల మొబైల్​ టాయ్​లెట్స్​కి ఆదరణ.. కోదాడలో ప్రారంభం!

By

Published : Sep 21, 2020, 2:25 PM IST


పలు పనుల నిమిత్తం నిత్యం మహిళలు పట్టణాలకు అధికసంఖ్యలో వస్తుంటారు. బహిర్బూమికి వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ప్రజా మరుగుదొడ్లు ఉన్నపటికీ వాటి నిర్వహణలో లోపాలు కారణంగా పూర్తిస్థాయిలో వినియోగంలో లేకుండా పోయాయి. కోదాడ పట్టణానికి చెందిన జలగం సుధీర్,సుష్మ దంపతులు విదేశాలలో విజయవంతంగా నడుస్తున్న సంచార మరుగుదొడ్లను తెలంగాణలో ప్రారంభించాలని ఆలోచించారు. ముందుగా పుట్టి పెరిగిన ప్రాంతమైన కోదాడ మున్సిపాలిటీకి అందించాలనుకున్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సహకారంతో కోదాడ మున్సిపాలిటీకి మొబైల్​ టాయ్​లెట్స్​ ఏర్పాటు చేసి.. నెలరోజుల క్రితం ప్రారంభించారు..

మహిళల మొబైల్​ టాయ్​లెట్స్​కి ఆదరణ.. కోదాడలో ప్రారంభం!


కదిలే మరుగుదొడ్డి..

రద్దీ ఉన్న ప్రదేశాలలో, కూడళ్లలో, చిన్న చిన్న గల్లీల్లోకి కూడా వెళ్లేలా ఈ వాహనం రూపొందించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్డిని ఎంతోమంది మహిళలు ఉపయోగించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోదాడలోని రంగ థియేటర్, నలంద స్ట్రీట్, బంగారపు దుకాణాలు, వస్త్ర దుకాణాల సముదాయాలల్లో ఎలక్ట్రిక్ మరుగుదొడ్డి మహిళలకు ఉపయోగకరంగా ఉంది. ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని ట్యాంకులో ఉపయోగిస్తారు. వ్యర్థాలను పైపు ద్వారా సెప్టిక్ ట్యాంకుల్లో వదిలేస్తున్నారు. మహిళల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఈ వాహనంలో ఏర్పాటు చేశారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన శాని డంప్ టెక్నాలజీ ఉపయోగించి రద్దీ ప్రదేశాల్లో సంచార మహిళా శౌచాలయం ఏర్పాటుచేశారు..



మహిళలకు ఉపాధి..

మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇద్దరు మహిళల్ని డ్రైవర్లుగా మున్సిపాలిటీ వారు నియమించారు. మహిళలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించి వాహన బాధ్యతను అప్పగించారు. డ్రైవర్ కూడా మహిళనే నియమించడం వల్ల స్త్రీలు ఇబ్బంది పడకుండా శౌచాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు..



సంచార శౌచాలయం ప్రత్యేకత..

ఈ సంచార శౌచాలయ వాహనం పెట్రోల్, డీజిల్తో కాకుండా విద్యుత్ ఛార్జింగ్​తో నడుస్తుంది. ఇది పూర్తిగా కాలుష్యరహిత వాహనం. 51.1వోల్ట్ బ్యాటరీ ప్యాక్, 1200 వోల్ట్ మరియు 48వోల్ట్ మోటర్లతో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. వాహనం ఎక్కడ ఉందో తెలుసుకోడానికి జీపీఎస్ ట్రాకింగ్ కూడా అమర్చారు. నీటిని నిల్వ ఉంచేందుకు 70లీటర్ల సామర్థ్యం వుండే ట్యాంకర్​ను వాహనం పైన ఏర్పాటు చేశారు. వాహనం లోపల వాష్​బేసిన్, ఎల్ఈడి లైట్లు, టవల్ హ్యాంగర్, డస్ట్​బిన్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. విద్యుత్ ఛార్జింగ్ ద్వారా వాహనం నడుస్తుండడం వల్ల మున్సిపాలిటీకి కూడా నిర్వహణ భారం తగ్గింది.

తక్కువ ఖర్చుతో అందించేలా..

విదేశాలలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసిన అనుభవాన్ని జోడించి మహిళల గౌరవానికి సంచార శౌచాలయం ఏర్పాటుకు సుధీర్​, సుష్మ దంపతులు కసరత్తు చేశారు. స్వచ్ఛ తెలంగాణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి కనబరిచింది. ప్రాజెక్టు తయారీకి ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. సుమారు వంద వాహనాలను 2020 సంవత్సరం చివరి వరకు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని, మొదటగా కోదాడ మున్సిపాలిటీలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఒక వాహనం ఏర్పాటు చేయడానికి నాలుగు లక్షల ఖర్చు వచ్చింది. భవిష్యత్తులో లక్ష రూపాయలకే అందించాలనే ఆలోచనలో జలగం దంపతులు ప్రణాళికలు రచిస్తున్నారు.

అన్ని ప్రాంతాలకు విస్తరించేలా..

ఈ వాహనాన్ని మూడు దశల్లో ప్రజలకు చేరువయ్యేలా సుధీర్ దంపతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ప్రజలకు అవగహన కల్పిస్తూ పారిశుధ్య సమస్యను తీరుస్తారు. తద్వారా కాలుష్య నియంత్రణలో భాగం కావాలని భావించారు. రెండో దశలో వ్యర్ధాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మూడో దశలో మానవ వ్యర్ధాల నుంచి ఎరువుల తయారీకి ఏర్పాట్లు చేయనున్నారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో సంచార మహిళ శౌచాలయాలు విజయవంతంగా నడుస్తున్నాయి. వీటిని వినియోగించుకోవడానికి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇలాంటి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక

ABOUT THE AUTHOR

...view details