KCR Fires on Congress at Suryapet BRS Meeting :ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో విస్తృతంగా పర్యటించారు. మెడికల్ కళాశాల, ఎస్పీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా మెడికల్ కళాశాల భవనాల్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత సమీకృత వెజ్-నాన్‌వెజ్ మోడల్ మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చిన సీఎం కేసీఆర్.. ఆవరణలో మంత్రులు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డితో కలిసి కలియతిరిగారు.
అక్కడి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకున్న కేసీఆర్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 21ఎకరాల్లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ ఎదుట పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. నూతన భవన సముదాయాన్ని ప్రారంభించి... అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. సూర్యాపేటలో (Suryapet ) 100కోట్లకు పైగా ఖర్చుతో భవనాలు నిర్మించినట్లు సీఎం తెలిపారు. తలసరి విద్యుత్, తలసరి ఆదాయంతోఅగ్రస్థానంలో నిలిచామని తెలిపారు. ఆర్థిక, సాంఘిక అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
KCR Fires on Congress :అనంతరం జరిగిన ప్రగతి నివేదన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధిని వివరిస్తూనే విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ ఆపదమొక్కులు మొక్కేందుకు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వస్తున్నారని వారిని నమ్మితే ఆగమైపోతామని సూచించారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని మరో అవకాశం కావాలని అడుగుతోందని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛను ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
KCR Comments on Dharani Portal :భూసమస్యలకు పరిష్కారమార్గంగా మారిన ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ అంటోందని అదే జరిగితే... మరోసారి దళారీరాజ్యం వస్తుందని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో తమ విజయంపై ఎవరికీ అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల కంటే మరో 5 సీట్లు ఎక్కువే వస్తాయని తెలిపారు. కుల వృత్తులు చేసుకునేబీసీ బిడ్డలకు రూ.లక్ష చొప్పున ఇస్తున్నామని వివరించారు. కాళేశ్వరం జలాలు 480 కి.మీ. ప్రయాణించి సూర్యాపేట జిల్లాలోకి వస్తున్నాయని తెలిపారు.
సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు: జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నిధులు ఇస్తామన్నారు. కళాభారతి నిర్మాణానికి రూ.25 కోట్లు మంజురు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు కేటాయించామన్నారు. సూర్యాపేట అభివృద్ధికి మరో రూ.50 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రూ.30 వేల కోట్లతో పవర్ ప్రాజెక్టు... గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. సూర్యాపేటను జిల్లాగా చేసినట్లు గుర్తు చేశారు.