Jagadish Reddy on Congress Guarantees: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను(Congress Guarantees) చూస్తే ఇచ్చేలా ఉన్నాయా.. అసలు వారు అధికారంలోకి వస్తారానని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) ఎద్దేవా చేశారు. సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అన్నీ బోగస్ అన్నారు. కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్కు లేదన్నారు. అధికారం కోసం ఇక్కడి నేతల స్క్రిప్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు చదివారని అన్నారు.
Jagadish Reddy Comments on Congress: కాంగ్రెస్ ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాపీ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. అమలుకు సాధ్యం కానీ అబద్ధాల హామీలు ఇచ్చే అలవాటు కేసీఆర్కు లేదని తెలిపారు. నూటికి నూరు శాతం చెప్పిన హామీలు అమలు చేసి.. మేనిఫెస్టోలో చెప్పనవి కూడా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్షని పేర్కొన్నారు.
ఏ రాష్ట్రంలోనూ రూ.1000కి మించి ఇవ్వలేదు : కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రంలోనూ ఆదివారం ప్రకటించిన పథకాలు లేవన్నారు. రాష్ట్రానికో మెనిఫెస్టోతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. విజయభేరి సభ(Vijaya Bheri Sabha)లో చెప్పిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయానని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేతలు ఇస్తున్న పింఛన్లు ఎక్కడా రూ.1000 మించి ఇవ్వలేదని ఆరోపించారు. కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి పీతాంబరం పెడతా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని మంత్రిజగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.