అర్ధరాత్రి వేళ అటవీ భూములను చదును చేస్తున్నారన్న సమాచారంతో అడ్డుకునేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడిచేసి గాయపరిచారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
మఠంపల్లి మండలం సుల్తాన్‌పూర్ బ్లాక్ రిజర్వ్ అటవీ భూములను రామచంద్రాపురం తండాకు చెందిన కొందరు యంత్రాలతో చదును చేస్తున్నారని స్థానికులు చింతలమ్మగూడెం బీట్ అధికారి మురళికి అర్ధరాత్రి సమాచారం అందించారు. ఆయన బేస్ క్యాంపు సిబ్బంది సైదులు, విజయ్‌ను వెంట తీసుకుని అక్కడికి వెళ్లారు.
అప్పటికే అక్కడ సుమారు 20 మంది జేసీబీ సాయంతో భూమిని చదును చేస్తూ కనిపించారు. వారిని అడ్డుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించడం వల్ల ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు.
బీట్ అధికారి మురళి, విజయ్, సైదులుకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడం వల్ల వారు సమీప గ్రామంలోకి వెళ్లి, స్థానికుల సాయంతో ఇళ్లకు చేరుకున్నారు. సోమవారం డీఎఫ్‌వో ముకుంద్‌రెడ్డికి విషయాన్ని తెలియజేయగా ఆయన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. అనంతరం ఆర్వో శ్రవణ్‌కుమార్, డీఆర్వో కరుణాకర్‌లతో కలిసి మఠంపల్లి మండల కేంద్రంలో బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశారు.
అటవీశాఖ సిబ్బందిపై ఆక్రమణదారుల దాడి ఇదీ చదవండి:నిర్భయ దోషి పిటిషన్‌పై నేడు 'సుప్రీం' విచారణ