తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​లో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!

Congress Party Nalgonda Parliament meeting : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోని అంతర్గత విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఆ నియోజక వర్గ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

TS Congress, TPCC, Congres Party
Utham Kumar vs Revanth Reddy

By

Published : Mar 1, 2023, 10:55 PM IST

Congress Party Nalgonda Parliament meeting : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంతకాలంగా గందరగోళంగా ఉంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆ నాయకులకు మధ్య అంతర్గతంగా విభేదాలు ఏర్పడ్డాయి. అవి అధిష్ఠానం వరకు వెళ్లి ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్​ని మార్చేంత స్ధితికి చేరుకున్నాయి. దీంతో ఆ పదవిని వేరే వాళ్లకు అప్పగించారు.

అయినప్పటికీ పరిస్థితులు ఇంకా చక్కదిద్దుకోలేదని జరుగుతున్న కొన్ని ఘటనల వల్ల తెలుస్తోంది. తాజాగా జరిగిన మరో ఘటన వాటికి బలం చేకూరుస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరిగింది. దీనికి కొందరు నాయకుల్ని ఆహ్వానించారు. అయితే ఏమైందో ఏమో కానీ మళ్లీ వాళ్లను సమావేశానికి రావొద్దని చెప్పడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వర్గంగా భావిస్తున్న నాయకులు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కోదాడ నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమాయత్తం అయ్యారు. ఇందుకోసం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్‌ ఠాక్రే సమక్షంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీనికి ఉమ్మడి జిల్లాలోని నాయకులను పిలిచారు. అయితే మళ్లీ వీళ్లను రావొద్దని గాంధీ భవన్ నుంచి మంగళవారం ఫోన్లు వచ్చాయని సమాచారం. దాదాపు అందరు నాయకులు ఆగిపోవాల్సి రావడం, హాజరైన పటేల్‌ రమేష్‌ రెడ్డిని కూడా బయటకు పంపడం వివాదాస్పదమైంది.

ఫోన్లు చేసింది వీరికే:నిన్న ఫోన్‌ చేసి రావాలని చెప్పడం, ఇవాళ వద్దని చెప్పడం ఏమిటని, పీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని చామల కిరణ్‌కుమార్‌ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ వర్గంగా భావిస్తున్న నేతలను ఎందుకు వద్దంటున్నారో అయోమయానికి గురవుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, చెరుకు సుధాకర్‌, పటేల్ రమేష్ రెడ్డి, అద్దంకి దయాకర్, ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ప్రీతం లకు గాంధీభవన్‌ నుంచి ఫోన్ చేసి ఆ సమావేశానికి రావొద్దని చెప్పడం సరైంది కాదని చామల పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి వర్గం నాయకులుగా భావిస్తున్న వీరిని సొంతజిల్లాలో జరిగే సమావేశాలకు హాజరుకానివ్వకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వైఖరిని తప్పుబడుతున్నారు. ఆ నాయకులు ఇప్పటికే ఈ విషయం ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్‌ చౌదరిల దృష్టికి తీసుకెళ్లినట్లు చామాల తెలిపారు.

పీసీసీ కమిటీల్లో ఉన్న నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమావేశాలకు హాజరు కావచ్చు. కానీ తమను ఎందుకు వద్దని చెబుతున్నారని ఏఐసీసీ కార్యదర్శులను వారు నిలదీస్తున్నారు. సీనియర్లకు కౌంటర్‌గా కోదాడ నుంచే యాత్ర చేయాలని వారు భావిస్తున్నారు. ఈ అంశంపై ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకులు ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి ఠాక్రేకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details