హాట్‌స్పాట్, రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్లతో నల్గొండ, సూర్యాపేట జిల్లాలు నిఘా నీడలో చిక్కుకున్నాయి. వరుసగా వెలుగుచూస్తున్న కొవిడ్-19 కేసులతో రెండు జిల్లాల్లోనూ హై అలర్ట్ కొనసాగుతోంది. ఈనెల 8 తర్వాత ఇప్పటి వరకు కేసులే లేని నల్గొండ జిల్లాలో.. శనివారం ఒకటి, ఆదివారం రెండు కేసులు బయటపడ్డాయి. ఇక వారం నుంచి హడలెత్తిపోతున్న సూర్యాపేటలో మంగళ, బుధ వారాల్లో 31 కేసులు నమోదయ్యాయి. ఇలా పోటాపోటీగా వస్తున్న పాజిటివ్‌లతో రెండు జిల్లాల్లోనూ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రధానంగా జిల్లా కేంద్రాల్లోనే పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఒకే కుటుంబంలో ముగ్గురికి..
నల్గొండ జిల్లాలో 15 కేసులకు గానూ జిల్లా కేంద్రంలో 12, దామరచర్లలో 2, మిర్యాలగూడలో ఒక కేసు నమోదయ్యాయి. శనివారం నల్గొండ పట్టణంలోని ఓ మహిళకు వ్యాధి నిర్ధరణ కాగా.. ఆదివారం ఆమె కూతురు, కొడుకుకు వైరస్ ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యాధి బారిన పడగా.. కుటుంబ పెద్ద మాత్రం నెగిటివ్‌తో బయటపడ్డారు. శనివారం 23 మంది నమూనాలు పంపగా.. అందులో ఇద్దరికి పాజిటివ్, మిగతా వారందరికీ నెగిటివ్ వచ్చింది.