సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల పరిధిలో 2 లక్షల 36 వేల 842 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో లక్ష 20 వేల 427 మంది మహిళలుండగా... లక్ష 16 వేల 415 పురుష ఓటర్లున్నారు.
పటిష్ఠ భద్రత
369 మంది పీవోలు, 372 మంది ఏపీవోలు, 756 మంది ఓపీవోలు పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. నియోజకవర్గాన్ని 27 రూట్లుగా విభజించి... ఒక్కో రూట్‌కు ఒక్కో డివిజన్ స్థాయికి అధికారికి బాధ్యతలు అప్పగించారు. డీఐజీ, ఎస్పీతోపాటు 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు... విధుల్లో ఉన్నారు. సీఐఎస్ఎఫ్కు చెందిన 3 కంపెనీలు, సీఆర్పీఎఫ్కు చెందిన మరో 3 బలగాలతోపాటు రాష్ట్ర స్పెషల్ పోలీసు విభాగానికి చెందిన నాలుగు వందల మంది భద్రతలో పాలుపంచుకోనున్నారు. స్థానిక బలగాలతోపాటు 10 ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీలు, తక్షణ ప్రతిస్పందన దళాలు పనిచేస్తున్నాయి. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
144 సెక్షన్
79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించగా... రెండు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 302 పోలింగ్ కేంద్రాల పరిధిలో సెక్షన్-144 తో పాటు 30-యాక్టును అమలు చేస్తున్నారు. జిల్లా సగటుతో పోలిస్తే గత ఎన్నికల్లో హుజూర్ నగర్లో 2 శాతం ఎక్కువగా పోలింగ్ నమోదైంది. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో... 90 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి.