హుజూర్నగర్ ఉప ఎన్నిక ఈసీకి ప్రతిష్ఠాత్మకమే..! హుజూర్నగర్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికల్లో ప్రజా తీర్పు ఎటు వైపు ఉంటుందనే అంశం అందరిలో ఆసక్తిని రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంచుకోటలో పాగా వేసేందుకు... గులాబీ పార్టీ శతవిధాల యత్నిస్తోంది. తన కంచుకోటలోకి కారుకు దారి లేదంటున్నారు ఉత్తమ్.
సమస్యాత్మక నియోజకవర్గం...
రాష్ట్రంలోనే ఏకైక ఉప ఎన్నిక కావడం వల్ల... ప్రలోభాలకు పెద్ద ఎత్తున తెరలేచే అవకాశం కనిపిస్తోంది. అధికార, విపక్షాలు సాగించే సమరంలో నియోజకవర్గంలోని పల్లెల్లోనూ ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో సున్నిత నియోజకవర్గంగా హుజూర్ నగర్‌ను ఎన్నికల సంఘం గతంలోనే ప్రకటించింది. ఇక ప్రతిష్ఠాత్మక పోరును తలపించే ఉప ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భావన స్పష్టంగా కనపడుతోంది.
ఇటీవల జరిగి ఎన్నికల్లో 429 కేసులు నమోదు...
గత శాసనసభ ఎన్నికల్లో 20 చోట్ల... పంచాయతీ ఎన్నికల్లో 30 ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి. కోదాడ మండలం రామాపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద 80 లక్షల రూపాయలు పట్టుబడగా... సెగ్మెంట్ వ్యాప్తంగా మొత్తం కోటి రూపాయలకు పైగా నగదు చిక్కింది. శాసనసభ, పంచాయతీ, పరిషత్తు, పార్లమెంటు ఎన్నికల్లో... 429 కేసులు నమోదు కాగా, పెద్ద ఎత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 13 వందల మందికి పైగా బైండోవర్ చేశారు.
ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు...
రాష్ట్రంలో అత్యధిక ధన ప్రవాహం కలిగిన నియోజకవర్గాల్లో హుజూర్నగర్ది 15వ స్థానం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, నగదు పంపిణీ, మద్యం తరలింపు వంటివి విస్తృతంగా జరిగే ఆస్కారముందన్న ఉద్దేశంతో ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా పులిచింతల ప్రాజెక్టు, మట్టపల్లి వంతెన, పాలకవీడు మండలం మహంకాళి గూడెం, మేళ్లచెరువు మండలం కందిబండ, రామాపురం, చింతలపాలెం మండలం దొండపాడు, బుగ్గమాధవరం క్రాస్ రోడ్డు వద్ద అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేరేడుచర్ల, కోదాడ, పెన్‌పహాడ్ మండలాల్లో... మరో నాలుగు తనిఖీ కేంద్రాలు సైతం ఏర్పాటయ్యాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను... ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. మండలానికో జిల్లా స్థాయి అధికారి... ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షిస్తారు.
ఇవీ చూడండి:హుజూర్నగర్ ఉప ఎన్నికల ఇంఛార్జీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి