కోదాడ తాజా మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి నల్లమాడ పద్మావతి రెడ్డిని హుజూర్‌నగర్ ఉపఎన్నిక బరిలో దింపుతున్నట్లు ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఆర్క్‌టెక్స్‌ర్‌లో బీటెక్ పూర్తి చేసి ఇంటీరియర్ డిజైనర్‌గా స్థిరపడ్డ ఆమె ఏపీ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆర్డీ రెడ్డి కుమార్తె, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి. పద్మావతి రెడ్డి తన భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉండడం వల్ల పరోక్షంగా రాజకీయ నేపథ్యం కలిగి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొట్టమొదటిసారి కోదాడ నుంచి ఆమె... హుజూర్‌నగర్ నుంచి ఆమె భర్త ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు పోటీలో దిగి ఇద్దరూ గెలుపొందారు.
ఉత్తమ్ రాజీనామాతో ఎన్నిక అనివార్యం
2018లో జరిగిన ఎన్నికల్లో తిరిగి పోటీ చేయగా.. కోదాడలో పద్మావతి రెడ్డి ఓటమిపాలు కాగా హూజూర్‌నగర్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి నల్గొండ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హూజుర్‌నగర్ స్థానం అలా ఉండగానే.. నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. దీనితో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయడం అనివార్యమైంది.
షెడ్యూల్ వచ్చిన రోజే తెరాస అభ్యర్థి ప్రకటన
కేంద్ర ఎన్నికల కమిషన్ హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు వచ్చే నెల 21వ తేదీన నిర్వహించాలని నిర్ణయించి ఆ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆ నియోజక వర్గంలో రాజకీయ సందడి మొదలైంది. షెడ్యూల్ వచ్చిన రోజునే ఉత్తమ్‌పై పోటీ చేసి ఓటమిపాలైన వ్యక్తినే తెరాస తమ అభ్యర్థిగా ప్రకటించింది.
గతేడాది 756 ఓట్ల తేడాతో పద్మావతి ఓటమి
మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పద్మావతి రెడ్డి 2014లో కోదాడ నుంచి పోటీ చేసి 13,374 ఓట్లు మెజార్టీతో తెదేపా అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్‌పై విజయం సాధించారు. 2018లో తిరిగి కోదాడ నుంచి బరిలో దిగిన పద్మావతి రెడ్డి తెరాస అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ కంటే 756 ఓట్లు తక్కువ రావడం వల్ల ఓటమి పాలయ్యారు.