హుజూర్నగర్ నియోజకవర్గంలో 302 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బరిలో ముగ్గురు మహిళలు సహా 28 మంది అభ్యర్థులు నిలిచారు. ఉపఎన్నిక బరిలో అధికార పార్టీ తెరాస నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి, భాజపా నుంచి కోటా రామారావు, తెదేపా నుంచి చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు.
ఏడు మండలాల పరిధిలో పోలింగ్...
2,36,842 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,20,427 మంది మహిళా ఓటర్లు, 1,16,415 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 302 కంట్రోల్ యూనిట్లు, 604 బ్యాలెట్ యూనిట్లు, 302 వీవీప్యాట్లు ఏర్పాటు చేశారు. విధుల్లో 369 మంది పీవోలు, 372 మంది ఏపీవోలు, 756 మంది ఓపీవోలను నియమించారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది.
పటిష్ఠ భద్రత...
ఎస్పీ భాస్కరన్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 540 మంది సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, 400 మంది టీఎస్ఎస్పీ దళ సిబ్బందితో భద్రత పెంచారు. పోలింగ్ విధుల్లో 1500 మంది సిబ్బంది పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్, యాక్ట్ 30ను అధికారులు అమలు చేశారు.