సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు(pulichintala project)కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాం సామర్థ్యం 45.87 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 41.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 3,56,486 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా... మొత్తం 24 గేట్లకి 17 గేట్లను మూడున్నర మీటర్ల మేర ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పెరిగిన ఇన్‌ఫ్లో
జెన్‌కోలోని మొత్తం నాలుగు యూనిట్ల ద్వారా విద్యుతుత్పత్తి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఒక గేటు... సాయంత్రానికి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రాత్రి రెండు గంటల తర్వాత సాగర్ నుంచి ఇన్‌ఫ్లో పెరగడం వల్ల క్రమంగా గేట్లను ఒక్కొక్కటిగా ఎత్తి... దిగువకు విడుదల చేస్తున్నారు.
అప్రమత్తత అవసరం
ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులిచింతల ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జెన్‌కో(genco) వద్ద పటిష్ఠ భద్రత కొనసాగుతోంది. డ్యాం మీదకు క్రమంగా సందర్శకుల తాకిడి పెరుగుతోంది.
ప్రాజెక్టులకు జలకళ
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(rains in telangana)తో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి(godavari river), కృష్ణమ్మ(krishna river) పరవళ్లు తొక్కుతున్నాయి. నాగార్జునసాగర్(nagarjuna sagar) 22 గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో అనుకున్న సమయానికన్నా ముందుగానే గేట్లు ఎత్తారు. శ్రీశైలాని(srisailam)కి 4.41 లక్షల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 4.35 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఇది రెండు రోజుల నుంచి కొనసాగుతోంది.
కృష్ణమ్మ పరవళ్లు
సాగర్‌లోకి 3.72లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. 587.20 అడుగుల మేర నీటి మట్టాన్ని తాకింది. నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు జలాశయంలో 305 టీఎంసీల(TMC)ను కొనసాగిస్తూ 22 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు.
జలసవ్వడి
శ్రీశైలంజలాశయం నీటిమట్టం ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 883.80 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 208.7210 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇక్కడ 10గేట్లను 15 అడుగుల మేర పైకి ఎత్తి స్పిల్ వే ద్వారా 3,71,720 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో 63,499 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుందన్నారు.
పులిచింతల ప్రాజెక్ట్‌కు భారీగా వరద ఇవీ చదవండి: