కష్టపడితేనే మూడు పూటలా కడుపునిండా ముద్ద దిగేది. కష్టపడకుండా ఏదీ రాదన్నది దివ్యాంగుడైన ఖాదర్ పాషా గట్టిగా సంకల్పించుకున్నాడు. అతని పట్టుదల ముందు వైకల్యం చిన్నబోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనపోరాటంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సంకల్పం ముందు ఓడిపోయిన వైకల్యం
ప్రతి మనిషి తన జీవిత గమనంలో ఏదో ఒక పోరాటం చేయాల్సిందే. కష్టపడకుండా ఏదీ రాదన్నది జగమెరిగిన సత్యం. అన్నీ బాగున్నా ఏ పని చేయకపోతే జీవితమే వ్యర్థం. రెండు కాళ్లు లేకపోయినా రెక్కల కష్టం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఓ దివ్యాంగుడు. అతని మొక్కవోని దీక్ష ముందు వైకల్యం అడ్డురాలేదు. పొట్టకూటి కోసం సెంట్రింగ్ పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఖాదర్ పాషా జీవితమే ఇందుకు ఉదాహరణ.
సంకల్పం ముందు ఓడిపోయిన వైకల్యం
దివ్యాంగుడైన ఖాదర్ పాషా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గాలి మిషన్ నడుపుతూ జీవనోపాధి పొందేవారు. కరోనాతో గిరాకీ లేకపోవడం వల్ల అద్దె కట్టలేక... తనకు ఆసరాగా ఉన్న దుకాణాన్ని మూసేయాల్సి వచ్చింది. తర్వాత బతుకు బండిని లాగేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణ పనులు చేసి జీవనం సాగిస్తున్నాడు. మద్దిరాల మండల కేంద్రంలోని ఓ ఇంటి నిర్మాణ పనుల్లో నిమగ్నమై జీవిత పోరాటంలో ముందుకెళ్తున్నాడు.