కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో నల్గొండ, సూర్యాపేట జిల్లాలు పోటాపోటీగా ధాన్యం కొంటుండగా.. యాదాద్రి జిల్లాలో ప్రక్రియ నిదానంగా సాగుతోంది. 15 రోజుల గణాంకాల్ని పరిశీలిస్తే నల్గొండ, సూర్యాపేట జిల్లాలు రాష్ట్రంలోనే రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాణ్యమైన సరకు తీసుకురావాలన్న నిబంధతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా తాలు పేరిట 41 కిలోల సంచిలో 45 కిలోలకు పైగా తూకం వేస్తూ.. రైతులను నిలువునా ముంచుతున్న వైనం తిప్పర్తిలో బయటపడింది. ఒక్కో సంచికి 4 కిలోలకు పైగా వడ్లను అదనంగా తీసుకోవడంపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొనుగోలులో జాప్యంపైనా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో 7 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. తాలు విషయంలో రైతులు, అధికారులు, మిల్లర్ల మధ్య పేచీ నడుస్తోంది. కొన్ని కేంద్రాల్లో తాలు పేరిట క్వింటాలుకు అదనంగా ధాన్యం తీసుకుంటుండగా.. రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎందుకులే గొడవ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.