ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. అలాంటి అభిరుచిని ఆచరణలో పెట్టే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందినవారే సూర్యాపేట జిల్లా మునగాల మండల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు సిరంగి రంగారావు. ఇప్పటివరకు 100 దేశాల కరెన్సీని సేకరించి వందకు పైగా పాఠశాలల్లో ప్రదర్శనలు ఇచ్చి విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. బోధన వృత్తిగా.. నాణేల సేకరణ ప్రవృత్తిగా వివిధ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను కల్పిస్తూ అందరి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
దశాబ్ద కాలం నుంచి సేకరణ...
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన సిరంగి రంగారావు 10 సంవత్సరాలుగా మునగాల మండలంలోని ముకుందాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం 3,4,5 తరగతుల విద్యార్థులకు 'ద్రవ్య కొలమానం' అనే అంశంపై బోధించేందుకు నాణాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వారి కుమారుల ప్రోత్సాహంతో విదేశీ కరెన్సీ, ప్రాచీనకాలం నాటి నాణేలను సేకరించాడు. అలా ఇప్పటివరకు ఆయన సేకరించిన నాణేలల్లో క్రీ.పూ 1000వ సంవత్సరానికి చెందిన చైనా పురాతన నాణెం కూడా ఉంది. వీటితోపాటు పైసా, అణా, బేడాలతో పాటు బ్రిటిష్ కాలం నాటి చిల్లిపైసా, అర్ధ అణా, వెండి నాణాలు, శివాజీ ఛత్రపతి మహారాజ్ కాలం నాటి నాణేలను సేకరించారు.
ఆశ్చర్యపోతున్న విద్యార్థులు...