గంజాయి మత్తుకు బానిసైన సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 8వ తరగతి విద్యార్థి ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న ఆగ్రహంతో తల్లి .. బాలుడిని స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పోసి కొట్టడంతో గాయపడ్డాడు. గంజాయి అధిక మోతాదులో తీసుకోవడంతో బాలుడికి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు తలెత్తినట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
ఏడాది నుంచి తోటి స్నేహితులతో కలిసి నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ, ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే మత్తులో తూగుతూ ఉండే వాళ్లమని విద్యార్థి తెలిపాడు. ఒక సారి ఫ్రెండ్ ద్వారా గంజాయి సేవించడంతో దానికి బానిసయ్యానని వివరించాడు. అరకు నుంచి గంజాయి వస్తుందని, ఒక్కో పొట్లం రూ.500 చొప్పున కొనుగోలు చేస్తున్నామని తెలిపాడు. తాము కూలి పనులకు ఉదయం వెళ్లి రాత్రికి ఇంటికి వస్తామని, కుమారుడు గంజాయి సేవిస్తున్న విషయం ఆలస్యంగా గుర్తించామని విద్యార్థి తండ్రి మీడియాకు వెల్లడించారు.