తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులదే దందా.. ఐదారు వందలు తగ్గించి దోపిడీ - Paddy Procurment in telangana

Farmers In Losses: యాసంగిలో వరి పండించిన రైతులకు నష్టాలే మిగిలాయి. అకాల వర్షాలు, తెగుళ్లు, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Farmers
Farmers

By

Published : Jun 3, 2022, 7:02 AM IST

Farmers In Losses: యాసంగిలో వరి పండించిన రైతులకు నష్టాలే మిగిలాయి. అకాలవర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోగా, చేతికొచ్చిన అరకొర పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. క్వింటాకు రూ. 1,960 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర నేతిబీర చందంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6,578 కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోవడంతో రైతులకు రోజుల తరబడి పడిగాపులు తప్పడంలేదు. ‘తరుగు’ పేరుతో క్వింటాకు 6 నుంచి 8 కిలోలు దోచేస్తున్నారు. ఈ బాధలు పడలేక.. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో.. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే రైతులకు మద్దతు ధరకన్నా రూ.ఆరేడు వందలు తగ్గించి ఇస్తూ దోచేస్తున్నారు.

దిగుబడి అంచనా తగ్గినా...ధర రాదా?:రాష్ట్రంలో 35 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు చేయగా, 68 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని మార్కెటింగ్‌ శాఖ అంచనా వేసింది. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 56.14 లక్షల టన్నులే కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇప్పటికే 39.19 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులకు రూ.7671.77 కోట్ల మద్దతు ధర చెల్లించి కొన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ప్రభుత్వానికి తాజాగా తెలిపింది. కానీ వ్యవసాయ మార్కెట్లలో ప్రైవేటు వ్యాపారులు మరో 9,83,898 టన్నులు నేరుగా రైతుల నుంచి కొన్నారని మార్కెటింగ్‌ శాఖ ప్రభుత్వానికి తాజా నివేదిక సమర్పించింది.

బయట ఎందుకు అమ్ముతున్నారంటే...:ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ఇస్తామని చెబుతున్నా తక్కువ ధరలకే ప్రైవేటు వ్యాపారులకు ఎందుకు అమ్ముతున్నారని సూర్యాపేట, తిరుమలగిరి, జనగామ తదితర మార్కెట్లలో రైతులను ప్రశ్నించగా పలు సమస్యలు ఏకరవు పెట్టారు. ఉదాహరణకు తిరుమలగిరి మార్కెట్‌కు ఒక్కోరోజు 30-40 వేల ధాన్యం బస్తాలను అమ్మకానికి తెచ్చినా.. ఉదయం 10 నుంచి రాత్రి 10 లోగా వ్యాపారులు కొనేసి, వెంటనే రైతులకు డబ్బు చెల్లించేస్తున్నారు. కానీ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రోజుకు కనీసం 10 వేల బస్తాలు తీసుకెళ్లినా తేమ ఉందని, లారీలు లేవని, తూకం ఆలస్యమవుతుందని నిర్వాహకులు సాకులు చెబుతుండడంతో.. రైతులు కనీసం వారం, పది రోజులు పడిగాపులు పడాల్సి వస్తోంది. ధాన్యం కొన్న తరువాత లారీలు రాలేదని.. మిల్లులకు తరలించేదాకా తమదే బాధ్యతని సతాయిస్తున్నారంటూ రైతులు వాపోయారు. వర్షాలకు ధాన్యం తడిసిపోతే.. నాలుగైదురోజులు ఆరబెట్టాకే కొంటామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధలన్నీ పడలేకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నామని చెప్పారు. తిరుమలగిరి, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చాలావరకూ ప్రభుత్వం మూసేసినా ఇప్పటికీ ఈ మార్కెట్లకు రైతులు రోజూ వందలకొద్దీ బస్తాల ధాన్యాన్ని తెస్తుండటంతో వ్యాపారులు తక్కువ ధరకే కొనేసి దోపిడీ కొనసాగిస్తున్నారు.

ఇంత దోపిడీనా?

ఉదాహరణకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో ఏప్రిల్‌, మే నెలల్లో మొత్తం 2,48,216 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల నుంచి వ్యాపారులు నేరుగా కొన్నారు. ఇందులో కనీసం ఒక్క క్వింటాకైనా మద్దతు ధర చెల్లించలేదు. గరిష్ఠంగా రూ.1859, కనిష్ఠంగా రూ.1237 మాత్రమే ఇచ్చారు. సగటు ధర రూ.1619 చొప్పున చెల్లించినట్లు మార్కెటింగ్‌ శాఖ నివేదికలో తెలిపింది. అంటే మద్దతు ధర రూ. 1960తో పోలిస్తే, క్వింటాకు రూ.341 చొప్పున రూ.8.46 కోట్లు రైతులు నష్టపోయారు.

* సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం రైతులు 584 క్వింటాళ్ల ధాన్యాన్ని తీసుకురాగా ధర రూ.1360 నుంచి రూ. 1749 మాత్రమే ధర చెల్లించారు.

* రాష్ట్రంలో ఈ యాసంగి ధాన్యంలో ప్రైవేటు వ్యాపారులు కొన్న మొత్తం 9,83,898 టన్నుల్లో తిరుమలగిరి మార్కెట్లో కొన్నది కేవలం 2.5 శాతం (24,821 టన్నులు) మాత్రమే. దీనికే రైతులు రూ.8.46 కోట్లు నష్టపోయారంటే మిగిలిన 97.5 శాతం (9,59,077 టన్నుల)పై ఇంకెన్ని కోట్లు కోల్పోయారో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారులు క్వింటాకు కనీసం రూ.300 చొప్పున తగ్గించారనుకున్నా, 9,83,898 టన్నులపై రూ.295 కోట్లకు పైగా రైతులు నష్టపోయినట్లే.

క్వింటాకు రూ.610 చొప్పున రూ.15,210 నష్టం...

నేను యాసంగిలో ఎకరం విస్తీర్ణంలో వరి పంట సాగుచేశాను. 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం తెస్తే క్వింటాకు రూ.1350 చొప్పున మాత్రమే చెల్లించారు. మద్దతు ధర రూ.1960తో పోలిస్తే క్వింటాకు రూ.610 చొప్పున మొత్తం 25 క్వింటాళ్లకు రూ.15,250 నష్టపోయాను.

- ఎస్‌.సైదులు, వరి రైతు, కంచనపల్లి, సూర్యాపేట జిల్లా

రూ.22 వేల నష్టానికి ఎలా అమ్మాలి?

ఈ రైతు పేరు గోని సంజీవరెడ్డి. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వనపర్తిలో యాసంగి పంటగా మూడు ఎకరాల్లో తెలంగాణ సోనా రకం సన్న వరి సాగుచేశారు. 38 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి తెచ్చారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు మద్దతు ధర రూ.1960 ఇస్తుంటే ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్‌లో కేవలం రూ.1370 మాత్రమే ఇస్తామని వ్యాపారులు చెప్పారు. కనీసం రూ.1600 అయినా ఇవ్వాలని సంజీవరెడ్డి ప్రాధేయపడినా ఫలితం లేదు. వ్యాపారి అడిగిన ధరకు వడ్లు అమ్మితే రూ.22,420 నష్టమని, తిరిగి ఇంటికి తీసుకెళతానని సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రానుపోను ధాన్యం రవాణాకు, మార్కెట్‌లో రాశులుగా పోయడానికి కూలికి వెచ్చించిన డబ్బు వృథా అయ్యిందని వాపోయారు. ఇంత తక్కువ ధరలకు అమ్మితే తాము ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు.

ఇవీ చూడండి..

పదిహేను రోజుల పాటు ఐదో దఫా పల్లె ప్రగతి కార్యక్రమాలు

తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details