Women Friendly Village in Suryapet District: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏపూరు గ్రామాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. వివిధ అవసరాల కోసం నిధులు కేటాయించగా.. ఆ గ్రామ పంచాయతీ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తోంది. సమష్ఠి కృషితో ఉమెన్ ఫ్రెండ్లీ విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కించుకుంది. పంచాయతీలను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు తొమ్మిది విభాగాల్లో ఉత్తమంగా ఉన్న పంచాయతీలను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపిక చేసి నగదు ప్రోత్సాహం అందించేలా.. కేంద్రం చర్యలు తీసుకుంది. అందులో మంచి పనితీరు కనబర్చిన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందిస్తోంది. గ్రామ పంచాయతీకి ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు రూ.50 లక్షలను ప్రకటించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Women Friendly Panchayat Division: ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ పంచాయతీ అవార్డు సొంతం చేసుకున్న ఏపూరు.. ఏకంగా జాతీయ స్థాయి అవార్డు దక్కించుకోవడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ జనాభాలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. సర్పంచ్, ఉప సర్పంచి, ఎంపీటీసీగా మహిళలే ఎన్నికయ్యారు. 12 వార్డులకు గానూ 7 వార్డులకు మహిళలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గ్రామంలో వైద్యురాలు, ప్రధానోపాధ్యాయురాలు, పంచాయతీ కార్యదర్శి వంటి బాధ్యతల్లోనూ మహిళలే సేవలందిస్తున్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో మున్ముందు మరింత పురోగతి సాధిస్తామని గ్రామస్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
''మా ఊరికి జాతీయ స్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ విభాగంలో అవార్డు లభించింది. గ్రామ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సర్పంచ్, ఉప సర్పంచి, ఎంపీటీసీ, కార్యదర్శి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇలా అన్నిచోట్లా మహిళలే ఉన్నారు. అందరం సమష్ఠి కృషితో గ్రామాన్ని ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్‌గా తీర్చిదిద్దుకున్నాం.'' - రజిత, గ్రామ సర్పంచ్