ఎన్నికలంటేనే... వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. అధికారిక లెక్కలకన్నా... అనధికార లెక్కలే ఎక్కువగా ఉంటాయి. అభ్యర్థులైతే... ఎన్ని నిబంధనలున్నా అవి మాకు పట్టవులే అన్న ధోరణితోనే ఉంటారు. కానీ అసలు సిసలు అధికారులు రంగంలోకి దిగితేనే... వారి గుండెల్లో గుబులు మొదలవుతుంది. మొన్నటి వరకు లెక్కా పక్కా లేనంత తీరుగా వ్యవహరించిన పార్టీలు... ఇప్పుడు ఒకే ఒక్క అధికారి రాకతో చేసే ఖర్చులన్నింటినీ జాగ్రత్తగా లెక్కేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితానికి, ఇప్పటికీ చూస్తే... హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అనవసర హడావుడి బాగా తగ్గిపోయింది.
ముగ్గురు ఎన్నికల పరిశీలకులు...
ఈ నెల 4న హుజూర్నగర్ పట్టణంలో... తెరాస రోడ్ షో నిర్వహించింది. కేటీఆర్, జగదీశ్ రెడ్డి సహా అభ్యర్థి పాల్గొన్న ర్యాలీ... బైపాస్‌లోని మఠంపల్లి దారి నుంచి ఇందిరా సర్కిల్ వరకు కొనసాగింది. డీజేలు, లౌడ్ స్పీకర్లు, వేలాది మందితో చేపట్టిన ర్యాలీ... నిబంధనల్ని గాలికొదిలేసేలా ఉందన్న కారణంతో అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై కేసు నమోదైంది. అప్పట్నుంచి అధికార పార్టీతో పాటు మిగతా పక్షాలూ ఆత్మరక్షణలో పడ్డాయి. ముగ్గురు పరిశీలకుల్ని నియమించడం... అందులో ఇద్దరు ప్రత్యేక వ్యయ పరిశీలకులు ఉండటం... 20కి పైగా షాడో బృందాలు, ఫ్లయింగ్ స్వాడ్స్, ఎస్ఎస్టీ, వీడియో చిత్రీకరణ బృందాలు ఇలా... ఎన్నికల్ని డేగ కళ్లతో పరిశీలించడం మొదలైంది. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ సచీంద్ర ప్రతాప్ సింగ్ సాధారణ పరిశీలకుడిగా... అదే రాష్ట్రానికి చెందిన జి.కె.గ్లోకాని అనే ఐఆర్ఎస్ అధికారిని వ్యయ పరిశీలకుడిగా పంపారు. వీరిద్దరూ ప్రకటన వెలువడిన వెంటనే నియమితులు కాగా... మరో విశ్రాంత ఐఆర్ఎస్ బి.ఆర్.బాలకృష్ణన్‌కు ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా అక్టోబరు 4న ఈసీ బాధ్యతలు కట్టబెట్టింది.
ఆయన వస్తున్నారని గుబులు...
బి.ఆర్.బాలకృష్ణన్ వస్తున్నారని తెలియగానే... రెండు ప్రధాన పార్టీల నేతలు ఆయన గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. వివరాలన్నీ కూలంకషంగా సేకరించారు. 1983 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన బాలకృష్ణన్... ఆదాయ పన్ను శాఖలో డీజీగా పనిచేశారు. 2016లో కర్ణాటక, గోవా రీజియన్లో పనిచేసి... నిక్కచ్చైన అధికారిగా పేరుపొందారు. నోట్ల రద్దు సమయంలోనూ అక్రమ లావాదేవీలు జరగకుండా... ప్రత్యేక పద్ధతుల్లో నిఘా వేసి ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలాంటి అధికారి అడుగుపెడుతున్నాడని తెలియగానే... పార్టీలు హడావుడి తగ్గించాయి. ఇంతకుముందులా ఇష్టమొచ్చిన తీరుగా వాహనాలు వాడకపోవడం, ఎక్కడికెళ్లినా ఎక్కువ మంది వెంట లేకుండా చూసుకోవడం వంటి వాటిపై దృష్టి సారించాయి.
ఉల్లంఘనలు లేకుండా...