రాష్ట్రంలో రెండో పెద్ద జాతరగా గుర్తింపు పొందిన సుర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి జాతరకు 15 రోజుల ముందు జరిగే దిష్టి పూజ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే జాతర ఆదివారం మాఘశుద్ద అమావాస్య రోజు దిష్టి పూజతో జాతర ప్రక్రియకు మొదలవుతుంది. అనంతరం మాఘశుద్ద పౌర్ణమికి జాతర వేడుకలు ప్రారంభమవుతాయి. ఈనెల 28 నుంచి మార్చి 4వరకు ఆరు రోజుల పాటు జాతర జరగనుంది.
దేవర పెట్టె తరలింపు వేడుకలకు...
ఆనవాయితీ ప్రకారం మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి 33 దేవత విగ్రహాలున్న అందెనం సౌనమ్మ పెట్టె సుర్యాపేట మండలం కేసారం గ్రామానికి చేరుకుంది. మెంతబోయిన, గొర్ల వంశస్తులు కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో కాలినడకన దేవత విగ్రహాల పెట్టెను దురాజ్ పల్లి లింగమంతుల స్వామి గుట్టకు తీసుకువచ్చారు. దేవర పెట్టె తరలింపు వేడుకలకు పరిసర ప్రాంతాలు నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దేవర పెట్టె గట్టుకు చేరిన అనంతరం బైకాన్ వాళ్లు ముద్రపోలు వేసి దిష్టి పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి అమ్మవారికి గొర్రెను బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. యాదవ పూజారులు నైవేధ్యంలోని జ్యోతి ముద్దలను కేసారం, ఖాశీమ్ పేటకు చెందిన మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్థులకు అందించారు . లింగమంతుల స్వామి ఆలయం చుట్టూ బలి చల్లి దిష్టి పూజ చేశారు.
ఇదీ చదవండి:విదేశాల్లో కీలక పదవుల్లో 200 మంది భారతీయులు!