స్వచ్ఛభారత్ కోసం రూ. కోట్ల నిధులు కేటాయిస్తున్నా.. స్వచ్ఛత మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. చెత్త చెదారం, ఇతర వ్యర్థాలను నిర్జన ప్రదేశాల్లో, పాడుబడిన ఇళ్లమధ్య వేస్తున్నారు. ఫలితంగా పల్లెలు మురికికూపాలుగా మారుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తైన వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పంచాయతీలు, అధికారులు విఫలమవుతున్నాయి. వాటిల్లో చెత్తను వేయించాలనే ధ్యాస సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బందికి కొరవడింది. దీంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడంలేదు. నూతన పంచాయతీ పాలకవర్గం ఇటీవల బాధ్యతలు చేపట్టడం, వందల సంఖ్యలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం అయినందున దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పూర్తి కాని డంపింగ్ యార్డుల నిర్మాణం
పూర్వ నల్గొండ జిల్లాలో మొత్తం 901 డంపింగ్‌యార్డులు మంజూరుకాగా వాటిల్లో సుమారు 338 మాత్రమే పూర్తయినట్లుగా అధికారవర్గాలు లెక్కలు చెబుతున్నాయి. మరో 216 వివిధ దశల్లో ఉండగా, 347 డంపింగ్‌యార్డులను పలు సమస్యల కారణంగా ప్రారంభించనే లేదు. ఇప్పటి వరకు వీటి నిర్మాణాల కోసం రూ.4.60 కోట్లు ఖర్చుచేశారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన వీటి వినియోగంపట్ల ఆయా వర్గాలవారిలో చిత్తశుద్ధి కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి.