కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రను పురస్కరించుకుని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. స్థానిక మఠంపల్లి క్రాస్ రోడ్ నుంచి ఇందిరాచౌక్ వరకు చేపట్టిన ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెరాస పార్టీకి భాజపానే ప్రత్యామ్నాయమని డీకే అరుణ పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుందన్నారు. ప్రజలంతా భాజపా వైపే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తలపెట్టిన జన ఆశీర్వాద యాత్రకు భారీ స్పందన రాబోతుందన్న అరుణ.. హుజూర్నగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద సభ కొనసాగుతుంది. కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను కిషన్‌రెడ్డి ప్రజలకు వివరిస్తారు. త్వరలోనే తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుంది. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెస్తాం. కిషన్‌రెడ్డి యాత్రను ప్రజలు ఆశీర్వదించాలి. డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
అనంతరం హుజూర్నగర్ నుంచి కోదాడ జన ఆశీర్వాద సభకు భారీ ర్యాలీగా బయలుదేరారు. డీకే అరుణ వెంట ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.