Lingamantula Swami Jatara: తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద జాతరగా పేరొందిన పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతరకు వేళైంది. జాతర ప్రారంభ సూచికగా చేసే దిష్టి పూజ క్రతువుని సాంప్రదాయ బద్దంగా అర్థరాత్రి ఆలయ వంశపారం పర్య పూజారులు నిర్వహించారు. దిష్టి పూజతో రెండు వారాల ముందే జాతరకు ఆంకురార్పణ జరిగింది. ఎటువంటి ఆటంకం కలగకుండా జాతర జరగాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ వట్టే జనయ్య యాదవ్, జడ్పీటీసీ జీడీ బిక్షంలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్‌పల్లిలో లింగమంతులస్వామి జాతర జరగనుంది.
యాదవుల ఆరాధ్య దైవం పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న దురాజ్ పల్లి గ్రామంలో కొలువై ఉన్న లింగమంతుల స్వామి జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. సమక్క సారలమ్మ జాతర తరవాత అదే స్థాయిలో ఈ జాతరకు భక్తుల ప్రవాహం ఉంటుంది. అందుకే తెలంగాణా రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందింది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక లాంటి ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పెద్దగట్టుకు వస్తారు. మాఘ మాసం అమావాస్య తరవాత వచ్చే మొదటి ఆదివారం జాతర జరుపుతారు. జాతర జరిగే రెండు వారాల ముందుగా జాతర ప్రారంభ సూచికగా చేసే దిష్టి పూజ ఆదివారం రాత్రి యాదవ సాంప్రదాయ పద్దతుల్లో నిర్వహించారు.