తండ్రికి తన ఇద్దరు కూతుళ్లు తలకొరివి పెట్టి కన్న రుణం తీర్చుకున్న ఘటన సూర్యాపేట జిల్లా మోత్కూర్ మండలం భుజిలపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతల సత్యనారాయణ రెడ్డి (57) గురువారం సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో తన ఇద్దరు కూతుళ్లే అంత్యక్రియలు నిర్వహించారు.
సత్యనారాయణ రెడ్డి ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 20 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎన్నో రక్తదాన శిబిరాలను నిర్వహించి.. వేలాది యూనిట్ల రక్తాన్ని సత్యనారాయణ రెడ్డి సేకరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అధికంగా రక్తదాన శిబిరాలను నిర్వహించినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్చే ప్రశంసలు అందుకున్నారు. మోత్కూర్, గుండాల, అడ్డగుడూరు, ఆత్మకూరు మండలాల్లో ఫార్మాసిస్ట్‌గా ఆయన విధులు నిర్వర్తించారు.