సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో 13 నెలల బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ హైదరాబాద్కు తరలించారు.
తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం - ప్రమాద వార్తలు
తండ్రి చనిపోయాడని తెలియగానే కుటుంబసభ్యులంతా బయలుదేరారు. కడచూపు కోసం స్వగ్రామం బయలుదేరిన కుటుంబ సభ్యులు ఊహించనిరీతిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నలుగురు పట్టే కారులో 8 మంది ప్రయాణం చేశారు. ఈ దుర్ఘటనలో 13 నెలల బాబు బలయ్యాడు.
మోతె మండలం రాంపురం తండాకు చెందిన భూక్య బిక్షం ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో నివాసముంటున్నాడు. స్వగ్రామంలో ఉన్న బిక్షం తండ్రి భూక్య బింగ్య అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలియగానే బిక్షం తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రికిరాత్రే స్వగ్రామం బయలుదేరాడు.
వాహనాలు లేక ఒకే కారులో 8 మంది...
లాక్డౌన్ వల్ల వాహనాలు అందుబాటులో లేకపోవటం వల్ల నలుగురు పట్టే కారులో బిక్షంతో పాటు ఇద్దరు భార్యలు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, వారి పిల్లలతో ఒకే కారులో బయలుదేరారు. అర్ధరాత్రి సమయంలో చివ్వెంల మండలం బండమీది చందుపట్ల వద్ద కారును డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బిక్షం మనవడు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతావారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.