సూర్యాపేటలో రాష్ట్ర అత్యున్నత స్థాయి బృందం పర్యటించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. జిల్లా అధికారులతో సమీక్షించారు. హెలికాప్టర్లో సూర్యాపేటకు చేరుకున్న బృందం.. అత్యధిక కేసులు వెలుగుచూసిన కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించింది. జరుగుతున్న పరిణామాల గురించి కలెక్టర్, ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మొదట్లోనే జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి ఈ స్థాయికి వచ్చేది కాదని... డీజీపీ మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తే కట్టడి సాధ్యమయ్యేదని వ్యాఖ్యానించారు. రెండు గంటల పాటు కలెక్టర్, ఎస్పీ, ఓఎస్డీతో సమావేశమైన రాష్ట్ర బృందం... అనంతరం క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష చేపట్టింది. ప్రాథమిక కాంటాక్టులపై ఇప్పటికైనా దృష్టి సారించాలన్నారు. క్వారంటైన్లో ఉన్నవారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.