Heavy Security For Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని 7మండలాల్లో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపుర్ మండలాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఉపఎన్నిక జరుగుతున్న ఈ రెండు మండలాల్లో భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన పోలీస్ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల వేళ భద్రతాచర్యల్లో పాల్గొననున్న 2వేల మంది పోలీసులతో చౌటుప్పల్‌లో సీపీ భగవత్ సమావేశమయ్యారు. హింసాత్మక ఘటనలకు అవకాశమున్న కేంద్రాలను గుర్తించి.. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బృందాలతో బందోబస్తు ఉంటుందని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు.