వరుసగా బయటపడుతున్న కరోనా కేసులతో... సూర్యాపేట జిల్లాలో కలవరం మొదలైంది. నిర్ధరణ అయిన కేసులతో జిల్లా కేంద్రం హడలెత్తిపోతుంటే... కొత్తవి వచ్చిపడుతున్నాయి. గురువారం ఒక్కరోజే 16 కేసులు నమోదవడం... సంచలనానికి కారణమైంది. ఇప్పటికే 23 వెలుగు చూడగా... తాజా వాటితో మొత్తం సంఖ్య 39కి చేరుకుంది. సూర్యాపేట పట్టణంలోనే 28 నమోదవటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుండగా... 39 కేసుల్లో ముగ్గురు పిల్లలున్నారు.
నిన్న 16 మందికి
గత శనివారం 11 కేసులు నమోదవగా... ఆ రికార్డును అధిగమిస్తూ గురువారం ఏకంగా 16 మందిలో పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. అందులో జిల్లా కేంద్రానికి సంబంధించి 14 మందితోపాటు... తిరుమలగిరిలో ఒకరు, ఆత్మకూరు(ఎస్) మండలానికి చెందిన ఆరేళ్ల బాలుడు ఉన్నారు. కొత్తగూడెం బజారుకు చెందిన వ్యక్తి వల్ల ఆయన కూతురు ఇప్పటికే వ్యాధి బారిన పడగా, ఆ కుటుంబానికి చెందిన మరో 14 మందికి వైరస్ అంటింది. సూర్యాపేటలో 28, నాగారం మండలం వర్ధమానుకోటలో 6, తిరుమలగిరిలో 3, నేరేడుచర్ల, ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరులో ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి.
ఇద్దరి వల్ల 38 మందికి
పాత మార్కెట్ ప్రాంతంలో వైరస్ సోకిన వ్యక్తుల ప్రాథమిక కాంటాక్ట్ కలిగిన వ్యక్తులు... 200 మంది ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. వారందర్నీ ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించగా... నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అందులో గురువారం 47 మంది ఫలితాలు రాగా... 16 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లా నుంచి 502 నమూనాలు పంపగా... 353 మంది ఫలితాలు వచ్చాయి. ఇంకా 149 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఒకర్ని మినహాయిస్తే మొత్తం 39 మంది బాధితుల్లో... 38 మందికి ఇద్దరు వ్యక్తుల వల్లే వైరస్ సోకింది.