సూర్యాపేట జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. జిల్లా వ్యాప్తంగా 83 కేసులు నమోదైతే.. అందులో సూర్యాపేటలోనే 54 ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బృందం జిల్లాలో పర్యటించిన తర్వాత అధికారులు నిఘాను మరింత పెంచారు.
కూరగాయల మార్కెట్
ప్రధానంగా అన్ని కేసులకు సంబంధించి ప్రాథమిక కాంటాక్టులపైనే దృష్టి కేంద్రీకరించారు. ఓస్డీగా నియమితులైన సర్ఫరాజ్ అహ్మద్, ఐజీ స్టీఫెన్ రవీంద్రతోపాటు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. అత్యధిక కేసులకు కారణమైన కూరగాయల మార్కెట్ పరిసరాల్ని అధికార బృందమంతా ఈరోజు మరోసారి పరిశీలించింది.
కొవిడ్ బాధిత గ్రామాల్లో ఇంటింటి సర్వే
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో కొవిడ్ బాధిత గ్రామాల్లో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలోని బీబీగూడెంతోపాటు ఆత్మకూరు(ఎస్) మండలంలోని ప్రభావిత పల్లె సహా తిరుమలగిరిలో స్క్రీనింగ్‌ను మరింత పకడ్బందీగా చేపడుతున్నారు. సూర్యాపేటలో 54, ఆత్మకూరు(ఎస్) మండలంలో 15, తిరుమలగిరిలో 7, నాగారం మండలంలో 6, నేరేడుచర్లలో ఒక కేసు నమోదయ్యాయి.