తమకు జన్మించిన ఒక్కగానొక్క కూతురును అల్లారుముద్దుగా పెంచి.. పెళ్లి చేశారు. అనంతరం ఎవరిపైనా ఆధారపడకుండా తమకు తోచిన పని చేసుకుంటూ జీవనం సాగించారు సూర్యాపేటలోని జమ్మిగడ్డకు చెందిన వృద్ధ దంపతులు తోట పుల్లయ్య, జయమ్మ. పైసాపైసా కూడబెట్టుకొని రూ.4 లక్షలు వెనుకేసుకున్నారు.
కొన్నాళ్ల క్రితం బీబీగూడెంలో ఉంటున్న కూతురు పసుపులేటి వందన, అల్లుడు వెంకన్న వృద్ధులను మేం సాదుతామంటూ వారి వద్దనున్న నగదును తీసుకున్నారు. అయినప్పటికీ ఆ వృద్ధులు జమ్మిగడ్డలో అద్దె ఇంట్లో ఉంటూ సొంతంగానే జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 29న పుల్లయ్య (75) మృతి చెందారు.
అద్దె ఇంటి యజమానులు మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. కూతురు, అల్లుడు తొంగిచూడలేదు. గత్యంతరం లేక వృద్ధురాలు రాత్రంతా వీధిలోనే గడిపినట్లు సమాచారం. గురువారం ఉదయం స్థానికుల సాయంతో బీబీగూడెంలోని కూతురి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. తండ్రి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకపోవడమే కాకుండా బంధువులను సైతం రావొద్దని కూతురు తెగేసి చెప్పింది. కన్నతండ్రి చనిపోతే కనికరం లేకుండా మృతదేహంతో తమకు సంబంధం లేదని.. ఎటైనా తీసుకెళ్లమని చెప్పారు. అల్లుడు, బిడ్డతో పాటు మనవడు ఉన్నప్పటికీ అనాథలా మృతదేహం ముందు దిక్కుతోచని స్థితిలో ఆ పిచ్చితల్లి రోదించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దహన సంస్కారాలు నిర్వహించేందుకు అంగీకరించేలా వందన దంపతులకు సర్దిచెప్పారు.
ఇదీ చూడండి:భారత్కు రఫేల్- వాయుసేనకు కొత్త శక్తి