నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. నల్గొండలో ఇప్పటికే 16 కేసలు నమోదు కాగా... సూర్యాపేట జిల్లాలో వాటి సంఖ్య 12కు చేరుకుంది. జిల్లా కేంద్రంతో పాటు తిరుమలగిరి, నేరేడుచర్ల మండల కేంద్రాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున శనివారం ముగ్గురు వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో మూడు, నాగారం మండలం వర్ధమానుకోటలో ఆరు కేసులు బయటపడ్డాయి. తాజాగా సూర్యాపేట పట్టణంలోని కొత్తగూడెం బజారుకు చెందిన వ్యక్తిలో కరోనా వెలుగుచూసింది. ఇదే వీధికి చెందిన వ్యక్తి రెండ్రోజుల క్రితం వైరస్ బారిన పడగా.. ఇప్పుడు ఆయన కుటుంబంలోనే మరొకరు బాధితుడిగా మారారు.
నేరేడుచర్లలోని రామాపురం వీధిలో ఒకరికి వైరస్ సోకింది. ఇతను మర్కజ్ వెళ్లొచ్చినట్లు గుర్తించి క్వారంటైన్లో ఉంచారు. తొలిసారి పరీక్షల్లో ఈయనకు నెగెటివ్ వచ్చింది. రెండోసారి చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. తిరుమలగిరికి చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తులకు భోజనం పెట్టినట్లు తేలింది.
సూర్యాపేట కుడకుడ వీధిలో ఉండే యువకుడు.. తన భార్యతోపాటు అత్తగారి కుటుంబంలో ఐదుగురికి వైరస్ సోకడానికి కారణమయ్యాడు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సామాజిక వ్యాప్తి చెందిన తీరు విస్మయానికి గురి చేసింది. తిరుమలగిరిలో పాజిటివ్ వ్యక్తితో కలిసిన 41 మందిని గుర్తించగా... వారందర్నీ క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.