భారీ సంఖ్యలో కరోనా కేసులతో ఒక్కసారిగా రాష్ట్రస్థాయి అధికారుల దృష్టి ఆకర్షించిన సూర్యాపేటలో వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాన్ని ఇస్తుండటం వల్ల ఇదే ఒరవడి కొనసాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తులు సైతం వేగంగా కోలుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లాలో అత్యధిక కేసులు రావడంతో కట్టడికి ప్రభుత్వం ఐఏఎస్ అధికారి సర్పరాజ్ అహ్మద్‌ను డిప్యూటేషన్‌పై జిల్లాకు పంపింది. ఆయన నేతృత్వంలో జిల్లా పాలనాధికారి వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఇతర శాఖల అధికారులు బృందంగా ఏర్పడి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేశారు. ప్రభావిత ప్రాంతాల పరిధి తగ్గించి పాజిటివ్ కేసు వ్యక్తి ఇంటి సమీపంలోని 200 మీటర్ల పరిధిని పూర్తిగా కట్టడి, తదితర చర్యలతో ఐదురోజులుగా కేసులు నమోదు కాలేదు. ఫలితంగా సూర్యాపేటకొంతమేర కుదుటపడింది.
మూడు కంటైన్‌మెంటు జొన్ల తొలగింపు
జిల్లాలో మూడు కంటైన్‌మెంట్ జోన్లను తొలగిస్తున్నట్లు సూర్యాపేట కలెక్టరు, ఎస్పీ ప్రకటించారు. వారిద్దరూ పట్టణంలో తొలి వైరస్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటి సర్వే తీరును పరిశీలించి విలేకర్లతో మాట్లాడారు. పట్టణంలోని కుడకుడ ప్రాంతంలోపాటు నేరేడుచర్ల, మఠంపల్లి ప్రాంతాలను ఫ్రీ జోన్లుగా మారుస్తున్నామని తెలిపారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతాయని, ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.