కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రా నాయకులు కృష్ణా నది జలాలు తరలించుకుపోతుంటే కేసీఆర్ చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రైతులకు ఇంత అన్యాయం జరగలేదన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రాబోవు రోజుల్లో నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. పార్టీ బలోపేతంపై కార్యర్తలకు దిశానిర్ధేశం చేశారు.
ప్రజల్ని మోసం చేస్తున్నారు..
కృష్ణా నది నుంచి ఆంధ్రా నాయకులు 11 టీఎంసీల నీరు తీసుకుపోతుంటే... కేవలం మూడు టీఎంసీల కోసం కాళేశ్వరం నిర్మిస్తూ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ తీరుతో నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడారిగా మారే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణా నది జలాల అంశంపై కేంద్రం జోక్యం చేసుకోకపోవడం దారుణమని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాయని విమర్శించారు. కృష్ణా జలవివాదంపై పార్లమెంట్ వేదికగా బహిర్గతం చేసి, సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని తెలిపారు.